న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రదర్శించే శకటం ఖరారు అయింది. మూడు నాలుగేళ్ల విరామం తరువాత దేశ రాజధాని కర్తవ్యపథ్ కవాతులో వీరోచిత తెలంగాణ చరిత్రను తెలిపే శకటం నమూనాను ఇప్పటికే పూర్తి చేసి, తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రజాస్వామ్యపు మాతృమూర్తి పేరిట తెలంగాణ శకటం ఇతివృత్తం ఎంచుకున్నారు. ఇందులో తెలంగాణ యోధులు కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, రాంజీ గోండు వంటివార్ల చిత్తరువులు ఉంటాయి. శకటం రెండువైపులా రాష్ట్ర పురాతన సంస్కృతిని ప్రతిబింబించే కొమ్ముకోయ,
గుస్సాడి డప్పుల నృత్యకళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. మధ్యలో వీరాచారానికి ప్రతీక అయిన శివసత్తుల భంగిమలు ఉంటాయి. గతంలో రిపబ్లిక్ డే వేడుకలో తెలంగాణ తరఫున 2015 ఆ తరువాత 2020లో శకటాలు తరలినట్లు అధికారులు తెలిపారు. పలు కారణాలతో తెలంగాణ శకటం వేడుకలో చోటుచేసుకోలేదు. ఇటీవల సిఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి ప్రధానిని కలిసినప్పుడు శకటం విషయం ప్రస్తావించారు. దీని గురించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినతి ఇవ్వాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. శకటం ఇతివృత్తం, తరువాతి నమూనాకు రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనితో ఈసారి తెలంగాణ శకటం ముందుకు రానుంది.