Saturday, September 21, 2024

మురుగునీటి పరీక్ష ద్వారా వైరస్ అంచనా!

- Advertisement -
- Advertisement -

కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. థాయ్‌లాండ్ గుహ లోని గబ్బిలాల్లో కరోనాకు చెందిన కొత్తవైరస్ ఉన్నట్టు ఇటీవలనే బయటపడగా, చైనాలో మలేషియన్ పాంగోలిన్స్ (అలుగు)లో జిఎక్స్ పి2వి మ్యుటేడెడ్ వెర్షన్‌పై ప్రయోగాలు జరుగుతుండడం, దీని మరణాల రేటు 100 శాతం ఉన్నట్టు తెలియడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక మన దేశంలో కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని భారీ ఎత్తున ఒకవంక పరీక్షలు జరుగుతున్నా మరోవంక కరోనాకు చెందిన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. అలాగే వ్యాక్సిన్లు అందిస్తున్నా ఏదో ఒక చోట కేసులు బయటపడుతున్నాయి. ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలు ఒకలా ఉంటే, క్షేత్ర స్థాయిలో డేటా మరోలా ఉంటోంది. వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ లేదా ప్రోటోజోవా తదితర రోగకారక క్రిముల మూలాలు రోజుల కొలదీ మురుగునీటిలో పొంచి ఉండి మనుగడ కొనసాగిస్తుంటాయి.

వివిధ రకాల ఈ వ్యాధికారిక క్రిముల గుట్టు కనుగొనడానికి వ్యర్థ జలాల ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ లేదా పర్యావరణ పర్యవేక్షణ ఎంతో దోహదం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రజల నివాస ప్రాంతాల్లో వాడుక నీరుగా ప్రవహించే మురుగు నీటిని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పరీక్షిస్తే వీటి వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నికరంగా తెలుస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం కానీ లేబొరేటరీ వంటి భారీ పరికరాల అవసరం కానీ అంతగా ఉండదు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉనికిని లేబొరేటరీ పరీక్షల ద్వారా తెలుసుకోడానికి ముందు ప్రజల వాడుక మురుగు నీటిని పరీక్షిస్తే ఆయా ప్రాంతాల్లో వైరస్ ఉనికి ఏ స్థాయిలో ఉందో ప్రాథమికంగా తెలుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పోలియో వైరస్‌ను కనుక్కోడానికి దాదాపు ప్రతి దేశం లోనూ ఇదే పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా వినియోగించడం పరిపాటిగా సాగుతోంది.

మానవ మలినాల మురుగు నీటి నుంచి పోలియోను కచ్చితంగా కనుక్కోగలిగినప్పుడు ఇతర వ్యాధి కారక బ్యాక్టీరియా లేదా వైరస్‌ను కనుక్కోగలగడం ఏమంత కష్టం కాదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సార్క్ కొవిడ్ 2 వైరస్ నుంచి కొత్త వేరియంట్ల వరకు వీటి వ్యాప్తిని కనుక్కోడానికి మురుగు నీటి నమూనాల పరీక్ష ఉపయోగపడుతోందని రెండేళ్ల క్రితమే నిర్ధారణ అయింది. ఉదాహరణకు బెంగళూరులోని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిటిఐజిఎస్) చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఎక్స్ బిబి.1.16 ఒమిక్రాన్ వేరియంట్‌ను 2022లో బెంగళూరు నగరంలో కనుగొనగలిగారు. 2022 డిసెంబర్ 25న ఎక్స్ బిబి.1.16 ఒమిక్రాన్ జన్యుశ్రేణిని దేశంలో కనుగొనగా, 2022 డిసెంబర్ 1 నుంచి 2023 ఏప్రిల్ 8 వరకు 2856 జన్యుశ్రేణుల ద్వారా ఈ వైరస్ మూలాలను పుణె బిజె మెడికల్ కాలేజీకి చెందిన పరిశోధక బృందం కనుగొనగలిగింది.

ఆ సంవత్సరం ఫిబ్రవరిలో 9.3 శాతం వరకు ఉన్న ఈ వైరస్ ఏప్రిల్ మొదటి వారానికి 79.17 శాతానికి పెరిగింది.మార్చి నుంచి ఏప్రిల్‌లో 12,591 వరకు ఈ వైరస్ కేసులు పెరగ్గా, రోజువారీ పాజిటివ్ రేటు 4.39% వరకు ఉన్నట్టు ఆర్‌టి పిసిఆర్ పరీక్షల ద్వారా తేలింది.దీనికి భిన్నంగా పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా బెంగళూరులోని 28 సూయెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నుంచి టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిఐజిఎస్) నమూనాలను సేకరించి పరీక్షించింది. దీంతో బెంగళూరు నగరంలో వైరస్ వ్యాప్తి నికరంగా ఏస్థాయిలో ఉందో తేలింది. 28 సూయెజ్ ప్లాంట్ల నుంచి వారానికి ఒకసారి ఒక నమూనా వంతున సేకరించి పరీక్షించారు. మురుగునీటిలో పొంచి ఉన్న వైరస్ ఆర్‌ఎన్‌ఎ పోగులు మార్చి మొదటి నుంచి పెరుగుతూ ఏప్రిల్ 1 నాటికి అత్యంత గరిష్ఠ స్థాయికి చేరాయని బయటపడింది. ఈ స్థాయిలో ప్రతి మిల్లిలీటరు మురుగునీటిలో 80,000 వైరస్ కాపీలు కనిపించడంతో బెంగళూరు నగరం మట్టుకు కొన్ని వేలమంది వైరస్ బాధితులయ్యారని నిర్ధారణ అయింది.

తాము మురుగునీటిలో వైరస్‌తాలూకు ఆర్‌ఎన్‌ఎ పోగులు మాత్రమే కనుగొన్నాం తప్ప వైరస్ పోగు కాదని టిఐజిఎస్ డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. ఒకరికి సోకితే 10 మిలియన్ కాపీలను వ్యాపింప చేస్తారని అంచనాగా చెప్పారు. ప్రతి ప్లాంట్‌లో ప్రాసెస్ చేసిన మురుగునీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంత మందికి వైరస్ సోకిందో సులువుగా లెక్కగట్టవచ్చు. దీన్ని బట్టి 2022 జనవరిలో కొవిడ్19 వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందడానికి బిఎ.1,బిఎ.2 ఒమిక్రాన్ వేరియంట్లు దోహదం చేశాయని పరిశోధకులు వివరించారు. దేశం మొత్తం మీద 2022 మార్చి ఏప్రిల్ మధ్య కాలంలో ఎక్స్ బిబి.1.16 ఒమిక్రాన్ వ్యాప్తి చాలా జోరుగా సాగింది. బెంగళూరు నగరం మొత్తం మీద ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నందున, నగరంలో ఏ ప్రాంతంలో వైరస్ బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో వైరస్ సంఖ్యను బట్టి చెప్పవచ్చని డాక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. మురుగునీటి పరీక్ష నగరంలో ఇన్‌ఫెక్షన్ల మౌలిక చిత్రాన్ని చెప్పగలుగుతుంది. దీని బట్టే పౌర పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చు.

బయటపడకుండా అంతర్లీనంగా ఏ కొత్త వైరస్ వ్యాపించినా మురుగునీటి పరీక్షతోనే దాని ఉనికి తెలిసిపోతుంది. రోజువారీ పరీక్షలతో నిమిత్తం లేకుండా, లక్షణాలు కనిపించినప్పటికీ పరీక్షలు చేయించుకోడానికి కొందరు వెనుకాడుతుంటారు. పైకి కనిపించని (అసింప్టమేటిక్) లక్షణాలతో కొందరుండగా, కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించే (ఒలిగోసింప్టమేటిక్ ) కేసులు కూడా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యర్థ జలాల పరీక్ష అన్నది పర్యావరణ పర్యవేక్షణలో అత్యంత కీలకమైనది. దీనివల్ల ఒనగూడిన పెద్ద ప్రయోజనం ఏమంటే వైరస్ సోకిన వారు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం కానీ, పరీక్ష సౌకర్యాలు కల్పించవలసి రావడం కానీ అక్కర లేదు. అలాగే మురుగునీటిలో ఆర్‌ఎన్‌ఎ పోగుల్ని పరీక్షించడం కూడా సులువే. కరోనా మహమ్మారి ముమ్మరంగా వ్యాపిస్తున్న సమయంలో అభివృద్ధి చెందిన దేశాల పరిశోధకులు వ్యర్థ జలాల పరీక్షల ద్వారా మంకీపాక్స్, ఇన్‌ఫ్లుయెంజా,

కలరా వంటి వ్యాధుల ఉనికిని తెలుసుకోగలిగారు. గత ఏడాది నవంబర్‌లో జర్నల్ సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించిన పరిశోధన పత్రంలో అమెరికాకు చెందిన పరిశోధకులు డెంగ్యు, మలేరియా, జికా, టైఫాయిడ్ తదితర వైరస్‌లను కనుక్కోడానికి వ్యర్థ జలాల పరీక్షలను ముమ్మరం చేయడం అత్యంత అవసరమని ప్రతిపాదించారు. అయితే అమెరికా, ఐరోపా దేశాల్లో డెంగ్యూ కేసులు అంతగా ఉండవు. ఈ నేపథ్యంలో భారత్ వంటి ఉష్ణమండల దేశాల్లో కేవలం మానవ విసర్జిత వ్యర్థ జలాల ద్వారానే మలేరియా, డెంగ్యూ కేసులనన్నిటినీ అంచనా వేయగలమని ఒక నిర్ధారణకి రాలేం. డెంగ్యూ విషయంలో మనుషులు విసర్జించిన మలినాల ద్వారా వైరస్ రావడం చాలా తక్కువ. అందువల్ల సార్స్ కొవి 2 ఆర్‌ఎన్‌ఎ మాదిరిగా డెంగ్యూ వైరస్ ఆర్‌ఎన్‌ఎ పోగులను కేవలం వ్యర్థజలాల్లో కొన్ని స్థాయిల్లో కనుగొనడం కష్టం. వ్యర్థ జలాల పరీక్షల ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాప్తిని కచ్చితంగా అంచనా వేయడం ఒక సవాలుగా పరిశోధకులు పేర్కొన్నారు. ఒకచోట నుంచి మరోచోటికి వ్యాధిని వ్యాప్తి చేసే వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులకు వ్యర్థజలాల పరీక్షలు ఒక్కటే సరిపోవని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News