Monday, December 23, 2024

నా ప్రభుత్వానికి శ్రీరాముడే స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

22న రామ్ జ్యోతి వెలిగించండి
పేదరికం నిర్మూలనకు అది ప్రేరణ కాగలదు
దేశ ప్రజలకు ప్రధాని మోడీ వినతి
రూ. 2000 కోట్లతో అమృత్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన

సోలాపూర్ : నిజాయతీతో పాలన సాగించాలనే శ్రీరాముని సిద్ధాంతాలే తన ప్రభుత్వానికి ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. ఈ నెల 22న (సోమవారం) రామ్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలలో నుంచి పేదరికం నిర్మూలనకు అది స్ఫూర్తిదాయకం కాగలదని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని మూడు ఆగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ను ఒకటి చేయడం ‘మోడీ గ్యారంటీ’ అని, తన మూడవ హయాంలో ప్రజల ఆశీస్సులతో దానిని సాఫల్యం చేయగలనని మోడీ ప్రకటించారు.

‘మోడీ గ్యారంటీ’ అంటే ‘గ్యారంటీ పూరీ హోనే కీ గ్యారంటీ’ అని, చేసిన వాగ్దానాలను గౌరవించాలని శ్రీరాముడు మనకు నేర్పించారు. పేదల సంక్షేమానికి, వారి సాధికారతకు మనం నిర్ధారించిన లక్షాలు అన్నిటినీ నెరవేరుస్తున్నాం’ అని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో సుమారు రూ. 2000 కోట్లు విలువ చేసే ఎనిమిది అమృత్ ప్రాజెక్ట్‌లకు సోలాపూర్‌లో శంకుస్థాపన చేసిన అనంతరం జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోడీ ఈ విషయాలు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే ఉండగా ప్రధాని ఒక వారంలో మహారాష్ట్రను సందర్శించడం ఇది రెండవ సారి. ‘మహారాష్ట్రలో పిఎంఎవై అర్బన్ కింద పూర్తి చేసిన 90 వేల పైచిలుకు గృహాలను ప్రధాని జాతికి అంకితం చేశారు.

సోలాపూర్‌లో రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీలో 15 వేల ఇళ్లను కూడా ప్రధాని అంకితం చేశారు. ఆ ఇళ్ల లబ్ధిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు, విక్రేతలు, మరమగ్గాల కార్మికులు, చెత్త ఏరే శ్రామికులు, బీడీ కార్మికులు, డ్రైవర్లు ఉన్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు అటువంటి ఇళ్లలో బస చేసే అవకాశం తనకు వచ్చి ఉంటే బాగుండేదని తాను ఆశించినట్లు ప్రధాని గద్గద స్వరంతో చెప్పారు.

‘ప్రజల కలలు నెరవేరినప్పుడే ఆనందం కలుగుతుంది. వారి ఆశీస్సులే నా బడా పెట్టుబడి’ అని మోడీ పేర్కొన్నారు. ఇళ్లు పొందినవారు అయోధ్య రామ్ మందిర్ ప్రతిష్ఠాపన రోజు సోమవారం (22న) రామ్ జ్యోతి వెలిగించాలని మోడీ విజ్ఞప్తి చేస్తూ, అలా చేయడం వారి జీవితాలలో నుంచి పేదరికం నిర్మూలనకు ప్రేరణ కాగలదని అన్నారు. ‘శ్రీరాముడు తన ప్రజలకు ఆనందం చేకూర్చే పని చేశారు. నిరుపేదల సంక్షేమానికి, సాధికారతకు నా ప్రభుత్వం అంకితం అయింది. వారి ఇక్కట్లు తీర్చడానికి మేము పథకాలు ప్రారంభించాం’ అని ప్రధాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News