ఇల్లందకుంట ః అయోధ్య రాముడు ఒక్క బిజెపికే దేవుడు కాదని, దేశంలోని అందరికీ దేవుడని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శుద్ధ్ది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాముడిని బిజెపికి ఆపాదించ డం, వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని కోరారు. ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్తు ప్రపంచమంతా
ఎదురు చూస్తున్నందున ఆరోజు ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పవిత్రమైన దైవకార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో నిధుల సమీకరణలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, గౌతమ్‌రెడ్డి, సురేందర్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.