Thursday, November 14, 2024

అన్నపూరణి వివాదంపై నయనతార క్షమాపణలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన తాజా తమిళ చిత్రం అన్నపూరణి ద్వారా ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ప్రముఖ సినీ నటి నయనతార ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌లో తమిళనాట సినీ థియేటర్లలో విడుదలైన అన్నపూరణి చిత్రం నాలుగువారాల తర్వాత గత వారం ఓటిటి ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ రెండు ఫిర్యాదులు పోలీసు స్టేషన్లలో నమోదు కావడంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ నుంచి విరమించుకుంది. ఈ నేపథ్యంలో నయనతార గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో క్షమాపణలు చెప్పారు. జై శ్రీరామ్ అంటూ తన పోస్టును మొదలుపెట్టిన నయనతార తన చిత్రానికి సంబంధించి ఇటీవల సంభవించిన పరిణామాలపై నిజాయితీగా వివరణ ఇద్దామని బరువైన హృదయంతో తాను ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు.

మహిళలలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో అన్నపూరణి చిత్రాన్ని మంచి సందేశంతో నిర్మించామని, ఈ చిత్రం ఓటిటి ప్లాట్‌పామ్ నుంచి తొలగిస్తారని తాము ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. తాను కాని, తన చిత్ర బృందం సభ్యులు కాని ఎవరి మనోభావాలను గాయపరచాలని భావించలేదని, భగవంతుడిని నమ్ముతూ తరచు దేశమంతటా ఆలయాలను సందర్శించే తాను ఉద్దేశపూర్వకంగా అటువంటి పని ఎన్నడూ చేసే ప్రసక్తి లేదని ఆమె తెలిపారు. అన్నపూరణి చిత్రంలో దేశంలోని అత్యుత్తమ చెఫ్‌గా ఎదగాలని పట్టుదలతో కృషిచేసే ఒక యువతి పాత్రలో నయనతార నటించారు. తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ మాంసాహారాన్ని తయారుచేసే సన్నివేశాలలో నయనతార కనిపిస్తారు. నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో శ్రీరాముడి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయని, లవ్ జిహాద్‌ను ప్రోత్సహించే సన్నివేశాలు ఉన్నాయంటూ నయనతారతోపాటు చిత్ర యూనిట్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని థాణె జిల్లాకు చెందిన నయా నగర్ పోలీసు స్టేషన్‌లో నమయనతారతోపాటు చిత్ర నిర్మాతతోసహా ఎనిమిది మంది వ్యక్తులపై కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News