విశాఖపట్నం: తాను సినిమా హీరోగా ఎదగడానికి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి, ఎఎన్‌ఆర్ శత జయంతి కార్యక్రమం సందర్భంగా చిరు ప్రసంగించారు. యండమూరి వీరేంద్రనాథ్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం కింద రూ.2 లక్షల నగదు గల చెక్కును అందజేశారు. యండమూరి రచనల నుంచి వచ్చిన పాత్రలే తన సినీ ప్రయాణానికి మెట్లుగా ఉపాయోగపడ్డాయని చిరు చెప్పారు.
ఆయన రచనలతో ఎక్కువగా సినిమాలు తీసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పారు. ఆయన రాసిన నవల చిత్రాలతోనే తనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందని కొనియాఆరు. అభిలాష అనే నవల గురించి తన తల్లి చెప్పిందని, అదే నవలలో కీలక పాత్రను తనను పెట్టి కెఎస్ రామారావుగారు సినిమా తీశారని గుర్తు చేశారు. అందుకే తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతలను యండమూరికి అప్పగించానని చిరు తెలిపారు. ‘ఛాలెంజ్’ అనే సినిమా ఎంతో యువతను ప్రభావితం చేసిందని, కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చి పెట్టాయని చిరంజీవి కొనియాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ ఎన్‌టిర్, నటుడు ఎఎన్‌ఆర్‌లు దైవ సామానులని ప్రశంసించారు.
‘తిరుగులేని మనిషి’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తానే స్వయంగా స్టంట్ చేశాను. దీంతో ఆర్టిస్ట్‌లది విలువైన జీవితం అని, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, హీరోకి పెద్ద గాయమైతే నిర్మాత నష్టపోతాడని చెప్పేవారని, తనకు యుక్త వయస్సు కాబట్టి రియల్ చేయాలనుకున్నాను, కానీ ‘సంఘర్షణ’ సినిమా షూటింగ్ సమయంలో స్టంట్ చేస్తున్నప్పుడు తాను గాయపడడంతో ఆరు నెలలు సినిమాలో షూటింగ్ ఆపాల్సి వచ్చిందని చిరంజీవి గుర్తు చేశారు. పెద్దలు ఏది చెప్పిన మన మంచికే చెబుతారన్నారు. బలహీనతలను ఎప్పుడు బలంగా మార్చుకోవాలని ఎఎన్‌ఆర్ పలుమార్లు చెప్పాడని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాదని, విలాసవంతమైన వస్తువులు బదులుగా ఇళ్లు, స్థలాలు కొనుక్కోవాలని ఎన్‌టిఆర్ సలహా ఇచ్చేవారని పేర్కొన్నారు.