Saturday, December 21, 2024

ప్రతి 15 ఏళ్లకు కొత్త ఇవిఎంల కోసం రూ. 10,000 కోట్లు అవసరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఇవిఉంల జీవితకాలం 15 సంవత్సరాలు ఉంటుందని, జమిలి ఎన్నికలు జరిగిన పక్షంలో ఒక్కో ఇవిఎం సెట్ తన జీవితకాలంలో మూడు ఎన్నికలకు మాత్రమే ఉపయోగపడగలదని కేంద్ర ప్రభుత్వానికి సమపిన నోట్‌లో ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం టుందని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. జమిలి ఎన్నికలు జరిగితే ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒకటి లోక్‌సభ నియోజకవర్గానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి వంతున రెండు ఇవిఎంలు అవసరమవుతాయని ఇసి తెలిపింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ రోజుతోసహా వివిధ దశలలో పాత ఇవిఎంల స్థానంలో భర్తీ చేయడానికిఅదనంగా కొన్ని కంట్రోల్ యూనిట్లు(సియు), బ్యాలట్ యూనిట్లు(బియు),

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వివిప్యాట్) అవసరమవుతాయని ఇసి వివరించింది. ఒక్కో ఇవిఎంకు ఒక బియు, ఒక సియు, ఒక వివిప్యాట్ సెట్‌గా ఉంటాయి. జమిలి ఎన్నికల కోసం కనీసం 46,75,100 బియులు, 33,63,300 సియులు, 36,62,600 వివిప్యాట్లు అవసరమవుతాయని గత ఏడాది ఫిబ్రవరిలో న్యాయ మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో ఇసి పేర్కొంది. 2023 ప్రారంభంలో ఒక్కో ఇవిఎంకు అయ్యే అంచనా వ్యయం బియుకు రూ.7,900 చొప్పున, సియుకు రూ.9,800 చొప్పున, వివిప్యాట్‌కు రూ.16,000 చొప్పన ఉంది. జమిలి ఎన్నికలపై న్యాయ మంత్రిత్వశాఖ పంపిన ప్రశ్నావళికి సమాధానంగా ఇసి ఈ వివరాలు తెలియచేసింది. వీటితోపాటు అదనపు పోలింగ్, భద్రతా సిబ్బంది, ఇవిఎంలు భద్రపరచడానికి పటిష్టమైన గిడ్డంగి సౌకర్యాలు, అదనంగా మరిన్ని వాహనాలు అవసరమవుతాయని ఇసి తెలిపింది. కొత్త ఇవిఎంల తయారీ, ఇవిఎంలను భద్రపరచడానికి మరింత ఎక్కువగా గిడ్డంగి సౌకర్యాలు, అందుబాటులో మరిన్ని వాహనాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మొదటి జమిలి ఎన్నికలను 2029లోనే నిర్వహించడం సాధ్యమవుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

5 అధికరణలకు సవరణ అవసరం:
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించాల్సి వస్తుందని కూడా న్యాయ శాఖకు ఇసి తెలిపింది. పార్లమెంట్ పదవీకాలానికి సంబంధించిన రాజ్యాంగంలోని 83వ అధికరణను, లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన 85వ అధికరణను, రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలానికి సంబంధించిన 172వ అధికరణను, రాష్ట్ర శాసనసభల రద్దుకు సంబంధించిన 174 అధికరణను, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించిన 356వ అధికరణను సవరించాల్సి ఉంటుందని ఇసి వివరించింది. అంతేగాక పార్టీ ఫిరాయింపుల ్రఆధారంగా సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించిన

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో కూడా అవసరమైన మార్పులు చేయవలసి ఉంటుందని ఇసి తెలిపింది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో నియమించింది. రాజ్యాంగంలోని ప్రస్తుత నిబంధనలు, ఇతర చట్టపరమైన నిబంధనలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేసి సిఫార్సులు అందచేయాలని ఒక దేశం, ఒకే ఎన్నికలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం కోరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News