Thursday, December 26, 2024

కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్

- Advertisement -
- Advertisement -

బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, అందాపూర్ గ్రామంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…పధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును మళ్లీ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రధాని అనేక పథకాలను ప్రవేశపెటారని, వాటన్నింటిలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ఫుడ్ ప్రాసిసెంగ్ యూనిట్లకు కేంద్రం 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తుందన్నారు. చెరువులపై కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల సబ్సిడీ రైతులకు ఇస్తుందని గుర్తు చేశారు. ఎరువులపై తాము ఇచ్చే సబ్సిడీ ముందు రాష్ట్రం ఇచ్చే రైతుబంధు ఎంత అని ప్రశ్నించారు.

యువకులు ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారాలను పెంచుకోవాలని హితవు పలికారు. మరో 5 ఏళ్ల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచిత రేషన్ బియ్యాన్ని ఇస్తామని ప్రకటించారని, ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల్లో పోర్టిపైడ్ బియ్యాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కాలుష్యాన్ని నియంత్రించాలని యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. నానో యూరియాను వినియోగించుకోవాలని, త్వరలోనే మహిళా సంఘాలకు డ్రోన్ దీదీ పథకం కింద డ్రోన్లను సబ్సిడీపై ఇవ్వనున్నారని, వాటిని గ్రామాలలో అద్దెకి ఇచ్చి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కాగా, బోధన్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. షకీల్ తన కొడుకు రోడ్డు ప్రమాదం చేసినా తప్పించి పారిపోయేలా చేశాడని విమర్శించారు. అయితో, తన కొడుకు అలాంటి తప్పిదాలు చేస్తే కానీ నేరుగా పోలీసులకు అప్పగించేవాడిని అన్నారు. మొదటిసారి తప్ప తాగి రోడ్డు ప్రమాదం చేస్తే షకీల్ కొడుకును తప్పించాడని, అందుకే రెండవసారి రోడ్డు ప్రమాదం చేశాడని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సర్వీసుల సీనియర్ అధికారి, రాష్ట్ర ఇంచార్జి కమల్ వర్ధన్ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, గంగారెడ్డి, సర్పంచ్ సిర మంజుల సుదర్శన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా వైద్య శాఖ అధికారి సుదర్శనం, తహసీల్దార్ గంగాధర్, ఎంపిఓ పర్బన్న, డిప్యూటీ డిఎంహెచ్‌వో విద్య, బిజెపి నాయకులు సుధాకర్ చారి, మేక సంతోష్, బాలరాజు, మనోహర్, కూరెళ్ళ శ్రీధర్, బంటు రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News