సమగ్ర అధ్యయనం చేస్తాం
త్వరలో ధరణిపై మధ్యంతర నివేదిక
కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏపిలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుందని, దానిని అధ్యయనం చేసి త్వరలో ధరణిపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేస్తామని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధరణిపై లోతైన విచారణ జరుగుతుందని, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లుతుందన్నారు. విధ్వంసమైన వ్యవస్థను చక్కబెట్టడానికి కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని, ఓటమిని జీర్ణించుకోలేక గత పాలకులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం సరికాదన్నారు.
గతంలో మంత్రి హోదాలో కెటిఆర్ దావోస్ వెళ్లినప్పుడు పొంతనలేని లెక్కలు చెప్పి రాష్ట్రంపై నమ్మకం లేకుండా చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో నిక్కచ్చిగా రూ.40వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రపంచ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పామని పేర్కొన్నారు.