Monday, December 23, 2024

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

సమానత్వ స్ఫూర్తిని చాటేలా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు లేఖను అందచేసిన ఎమ్మెల్సీ కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ :అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఎమ్మెల్సీ కవిత కోరారు. సభా ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం గొప్ప ఆదర్శమన్నారు. గతంలో భారత్ జాగృతి తలపెట్టిన ఉద్యమంతో సమైక్య రాష్ట్రంలో సభా ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా సమానత్వ స్ఫూర్తిని చాటేలా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె స్పీకర్‌ను కోరారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఆయన నివాసంలో కవిత లేఖను అందజేశారు.
ఏప్రిల్ 11లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా…
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించాలని భారత జాగృతి తరఫున స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చినట్టు ఆమె తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీ లోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. గతంలో భారత జాగృతి పోరాటంతో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని,
ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని, ఈ సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన్ను పరామర్శించి వినతిపత్రం అందజేశామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
లేఖలోని సారాంశం….
ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చిరస్మరణీయమని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారన్నారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ పూలే అని ఆమె పేర్కొన్నారు. ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభలలో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశ్యంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శమన్నారు. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా. అంటేద్కర్ విగ్రహ ఏర్పాటు జరిగిందని, ఇది మనందరికీ గర్వ కారణమని ఆమె లేఖలో తెలిపారు. అదే కోవలోనే సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్కృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరమని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థల, బిసి సంఘాల చిరకాల కోరికగా ఆమె పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News