Monday, December 23, 2024

అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ముందుకు…

- Advertisement -
- Advertisement -

భౌతిక వాదాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విప్లవకారులదే..
దేశంలో హిందూత్వ భావాలు పెరుగుతున్నాయి
లెనిన్ రచనల్లో వీటికి సమాధానాలున్నాయి..
లెనిన్ శత వర్థంతి సభలో బివి. రాఘవులు

మన తెలంగాణ/హైదరాబాద్:  దోపిడీ, అసమానతలు, ఆర్థిక సంక్షోభం లేని కష్టజీవుల రాజ్యం రావాలనీ, ఆ దిశగా సోవియట్ రష్యా అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రెడ్ లెనిన్ శత వర్థంతి’ సభను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ నాటి పరిస్థితుల్లో లెనిన్ చెప్పిన విషయాలు, సమాజాన్ని ప్రపంచదేశాల్లో నడిపించాలనే ప్రజాఉద్యమాలకు, విప్లవోద్యమాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయని తెలిపారు. సమాజాన్ని పురోగమనంవైపుకు నడిపించాలనే వారికి ఇప్పటికీ మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పారు.

లెనిన్ సమాజాన్ని.. అనేక విషయాలను, అనేక విధాలుగా అధ్యయనం చేశారన్నారు. సైద్ధాంతికంగా మార్క్సు, ఎంగెల్స్ సిద్ధాంతాలను మరింత అభివృద్ధి చేశారని తెలిపారు. సమాజాన్ని మార్చటానికి అనువుగా ఆ సిద్ధాంతాలను అన్వయించటమే కాకుండా.. వాటిని వినియోగించి సమాజాన్ని ముందుకు నడిపడానికి వినియోగించారని గుర్తు చేశారు. నాటి పాలక వర్గాలు కష్టజీవులను గందరగోళపర్చటానికి, వారి ప్రయోజనాన్ని నెరవేర్చేందుకు ఉపయోగపడే వాదనలపై విశ్లేషణాత్మకమైన రచనలు చేశారని గుర్తు చేశారు. అప్పటికే సమాజంలో వ్యాపించి ఉన్న సైద్దాంతిక ప్రచారాలను పరిశీలించి వాటిని విమర్శణాత్మకంగా బట్టబయలు చేశారని వివరించారు. భౌతిక వాదం, ఆచరణవాదం విమర్శ ఆయన ముఖ్యమైన రచనగా చెప్పొచ్చన్నారు. భౌతిక వాదాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విప్లవ కారులపైనే ఉందన్నారు.

ఆ వాదాన్ని రక్షించుకోకపోతే..భావవాదం విస్తారంగా ప్రజల్లో వ్యాపిస్తుందనీ, అది విప్లవానికి ఆటంకంగా తయారవుతుందనీ, పాలక వర్గాలకు తోడ్పడుతుందనీ, వారి దోపిడీని రక్షించటమే బావవాదం లక్షణం అని విశదీకరించారని తెలిపారు. రాజకీయ, సామాజిక, విద్యా తదితర అన్ని వ్యవస్థల్లో భావవాదం ఇమిడి ఉంటుందనీ,అందుకే దాన్ని నిలవరించే విప్లవకారులుండాలన్నారు. అందుకు తగిన ప్రచారం నిర్వహించాలని చెప్పారు. కాలం మారుతున్నా కొద్ది కొత్తకొత్త సవాళ్లు ముందుకు వస్తుంటాయనీ, వాటికనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాలన్నారు. 1906లో విప్లవం ఓడిపోయిన తర్వాత అంతా నిరాశ..నిస్పృహలు ఏర్పడ్డప్పుడు లెనిన్ నిబ్బరంగా ఉన్నారన్నారు. ఎన్నొ సవాళ్లను తిప్పికొట్టారని వివరించారు. 1917లో విప్లవాన్ని సాధించారని తెలిపారు.

భారత దేశంలో హిందూత్వ భావాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భావవాదాన్ని రోజువారీ యుద్ధంలో ఎలా ఎదుర్కొవాలో లెనిన్ రచనలు ఉపయోగపడతాయన్నారు. అదే విధంగా ఆర్థిక శాస్త్రంలో కృషి ఎంతో చేశారన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు అర్థం చేసుకునేందుకు ప్రత్యేక రచనలు చేశారన్నారు. 1991లో పరిస్థితి మారిందన్నారు. భావజాల రంగాన్నంతా పెట్టుబడి తనగుప్పెట్లో పెట్టుకుందన్నారు. ప్రపంచాన్నంతా ఇప్పటికే గుత్తాపెట్టుబడి దారి వర్గం కంట్రోల్ చేస్తుందన్నారు. రండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారికంటే..ప్రాంతీయ యుద్ధాల్లో చనిపోయిన వారు 20 రెట్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇంధన వనరులపైన ఆధిపత్యం కోసం తెగల మధ్య ఘర్షణలను సృష్టింటమే సామ్రాజ్య వాద లక్షణమని వివరించారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News