Saturday, November 23, 2024

మనసు లోపలి నుండి వచ్చిన మాటలు

- Advertisement -
- Advertisement -

పాత్రికేయ వ్యాసాలు రాయడం కత్తిమీది సామే. ఎందుకంటే దానికి instant ness అవసరం. పూర్వాధ్యయనం ఉన్న రచయితలే ఇలాంటి ఆర్టికల్స్ కు న్యాయం చేయగలుగుతారు. సందర్భాన్ని బట్టి ఒక అంశం మీద తక్షణం వ్యాసం రాయాలంటే నూటికి తొంభై పాళ్ళు పూర్వజ్ఞానం మాత్రమే ఉపకరిస్తుంది. మిగతా పదిపాళ్ల కోసం ఒకటీ అర పుస్తకాలు సహకరించవచ్చు. కానీ సంపాదకీయాలు పూర్తిగా అది రాసే వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. పైగా పాత్రికేయ వ్యాసాలు ప్రసిద్ధ అంశాలపైనే ఉండాలని నిబంధన ఏమీ లేదు. కాబట్టి ఆసక్తికరంగా వ్యాసం రాయడం పెద్ద పరీక్షే. మాటలో మనసునై అలాంటి పరీక్షలో పాసయిందంటే రచయిత శక్తి చిన్నది కాదని అర్థం. కె.ఆనందాచారి నవ తెలంగాణ సోపతిలో వారం వారం రాసిన చిన్న వ్యాసాల సమాహారం మాటలో మనసునై. సోపతిలో రాసిన వ్యాసాలలో ఎంపిక చేసుకున్న 60 వ్యాసాల సంపుటి ఇది. ఇందులో శీర్షికలన్నీ సామాన్య వస్తువులు. స్వాగతం,పలకరింపు, స్నేహం, సిగ్గు, నవ్వు, కన్నీళ్లు తదితరాలు ఇందులోని వస్తువులు. ఈ వస్తువు మీద కొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా వ్యాసాలు రాశారు ఆనందాచారి.

స్వాగతాన్ని కొత్త సంవత్సరపు స్వాగతంగా పాఠకుడు తొలి రెండు పాదాలలోనే గమనిస్తాడు. మనుషులకు మాత్రమే పరిమితమైన కొత్త సంవత్సరం. అనంతమైన కాలానికి అసలే పట్టని విషయం ఇది. పక్షులకు, జంతువులకు, చివరికి ప్రకృతికి కూడా అవసరం లేని విషయం. అయినా మనిషి కొత్త సంవత్సరంలోకి ఎన్ని కోరికలతో ఎన్ని ఆకాంక్షలతో ప్రయాణం చేస్తాడో చెబుతూ రాసిన వ్యాసం ఈ పుస్తకంలో మొదటిది. నవ్వు అనే రెండక్షరాల మాట గురించి ఎంత పెద్ద వ్యాసమైనా రాయచ్చు. కానీ రెండు పేజీలకు మించకుండా రాసే వ్యాసంలో జాషువా లాంటి ప్రసిద్ధ కవిని, ఇతర వర్తమాన కవులు చెప్పిన విషయాల్ని గుదిగుచ్చి రాసిన అపురూపమైన ఆర్టికల్ నవ్వు. పైరు హోరు లాంటి రైతు పోరాటానికి సంబంధించిన వ్యాసాలు కూడా ఇందులో ఉండడం రచయిత ఆసక్తికి, పత్రిక నిబద్ధతకు సంబంధించిన అంశం. తరగతి గది ఎలా ఉండాలని మరో వ్యాసం ఉంది. దేశభక్తి అంటే ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ దేశభక్తికి భిన్నంగా ఆలోచించవలసిన అవసరాన్ని సున్నితంగా వ్యక్తీకరిస్తుంది. సైకిల్ అన్న మరో టాపిక్ వినగానే అందరికీ గుర్తొచ్చే నోస్ట్రాలజీయాతో పాటు ఆరోగ్యానికి సైకిల్ నడపడం ఎంత అవసరమో చెబుతుంది. ‘అమెరికన్ సామ్రాజ్యవాదం కమ్యూనిస్టు దేశమైన క్యూబా మీద అనేక ఆంక్షలు విధిస్తూ ఆర్థిక నిర్బంధానికి దిగినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రో పెట్రోలు వాహనాలకు బదులుగా దేశ ప్రజలందరినీ సైకిళ్లు వాడమని కోరారు‘ అన్న నిబద్ధ వాక్యాలు రచయిత జ్ఞానదృష్టిని, కమిట్మెంట్ ని తెలియజేస్తాయి.

మూఢవిశ్వాసాల గురించి, ఆహారపు అలవాట్ల గురించి, హత్యలు ఆత్మహత్యలు జరగడానికి కారణాల గురించి, ఆహార కొరతను ఎదుర్కొంటున్న ప్రజా సమూహం గురించి, మహిళల పోరాటాల మీద రాసిన వ్యాసాలు చాలా ఆలోచనాత్మకంగా నదిచసాయి. తీర్పుల్లో కూడా పితృస్వామ్య స్వభావం ఉంటుందేమోనని రాసిన వ్యాసంలో చేసిన పరిశీలనలు వాస్తవికమైనవే అనిపిస్తాయి. ఈ వ్యాసంలోనే ‘దేశాన్ని పరిపాలిస్తున్న వారి ఆలోచన ధోరణి కూడా మనువాద భావజాలాలతోనే కొనసాగుతున్నది‘ అంటారు. మహిళల పట్ల హింస, అత్యాచారాలు, హత్యలు, అసమానతల తీవ్రత రోజుకు పెరుగుతున్నవని చెప్పడం రచయిత విలక్షణ దృష్టి కోణాన్ని సూచిస్తుంది. సులభంగా చదవగలిగే ఈ వ్యాసాలు ఒక్కసారి చదివిన పాఠకుడు తదుపరి సందర్భాల కోసం ఈ పుస్తకాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటాడు. అదే దీని విజయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News