Saturday, December 21, 2024

ప్రశాంతంగా ప్రాణప్రతిష్ఠ

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టం ఘనంగా, వైభవోజ్వలంగా జరిగిపోయింది. దేశవిదేశాల్లోని విశ్వాసులు, భక్తకోటి కన్నుల పండువగా చూసి ఆనందపరవశులయ్యారు. చిరకాలంగా ఎన్నో మలుపులు తిరిగి, ఎంతో ఉత్కంఠ రేపి ఆవిష్కృతమైన ఈ పతాక సన్నివేశం ప్రశాంతంగా ముగిసిపోడం తో దేశం హాయిగా ఊపిరి పీల్చుకొన్నది. భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానాన్ని శిఖరానికి చేర్చిన ఘనత అయోధ్య బాబరీ మసీదు స్థలంలో రామ జన్మభూమిని పునరుద్ధరిస్తామన్న వాగ్దాన పాలన దిశగా సాగిన పరిణామాలకు ఉన్నది. 1984లో లోక్‌సభలో కేవలం 2 స్థానాలతో అత్యంత బలహీనంగా ఉండిన ఆ పార్టీ, 2014లో 282కి, 2019లో 303కి చేరుకొన్న మహాద్భుతం గొప్పతనం అంతా ఇందులోనే ఉన్నది. 1992 డిసెంబర్ 6న బిజెపి అగ్రనేతల సమక్షంలో అయోధ్యలో సంభవించిన మసీదు విధ్వంసం, కూల్చి వేత సెక్యులర్ భారతాన్ని మతపరమైన చీలికకు గురిచేసి హిందూ మెజారిటీ ఓటును ఆ పార్టీ కైవసం చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిలో దానికి ఎదురులేని స్థితిని కట్టబెట్టింది.

లోక్‌సభలో అత్యధికంగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను దానికి కంచుకోటను చేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ దాని బలాన్ని బాగా పెంచింది. మసీదు కూల్చివేతకు దారితీసిన రథయాత్ర సారథి ఎల్ కె అద్వానీ, తొలి బిజెపి ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఉపప్రధాని పదవికి నోచుకొని రిటైర్ అయిపోయారు. మసీదు కూల్చివేతను అనుసరించి దేశంలో చెలరేగిన హింసలో, మత కల్లోలాల్లో రెండు వేల మందికి పైగా మరణించారు. అంతకు మించి మెజారిటీ, మైనారిటీ మధ్య పచ్చిగడ్డి సైతం భగ్గుమనే విద్వేష వాతావరణం నెలకొన్నది. అందుచేత సోమవారం నాడు చోటు చేసుకొన్న రామాలయ ప్రాణప్రతిష్ఠ ఎటువంటి హింసకు తావు లేకుండా జరిగిపోడం సంతోషాన్ని కలిగించింది. దేశమంతటి నుంచి అయోధ్యకు జనసమీకరణ చేయకుండా జాగ్రత్త పడడం ఇందుకు దోహదపడిందని అనవచ్చు. రాముడు ఇక ఎంత మాత్రం ఒక గుడారంలో నివసించబోవడం లేదని వైభవోపేతమైన ఆలయ నివాసి అవుతున్నాడని, 2024 జనవరి 22 తేదీ ఒక తేదీగా కాకుండా ఒక కొత్త యుగారంభ దినంగా చరిత్రలో నమోదు అవుతుందని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించడం బిజెపి ఆంతర్యాన్ని చాటుతున్నది.

ప్రాణప్రతిష్ఠను ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిపించడంలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం గమనించదగింది. అయోధ్యలో మసీదు -రామ జన్మభూమి స్థల వివాదం చిరకాలం నలిగినలిగి చివరికి సుప్రీం కోర్టు తీర్పు ద్వారా పరిష్కారానికి వచ్చిన తీరు పట్ల అభ్యంతరాలు ఉన్నప్పటికీ దానితో వ్యవహారం ఒక కొలిక్కిరావడం బాగుంది. ఇతర ‘వివాదాస్పద’ స్థలాల పేచీలు రగలకుండా చేయడం దేశానికి క్షేమకరం అవుతుంది. విగ్రహ ప్రతిష్ఠాపన ఘట్టానికి కొందరినే ఆహ్వానించి అనేక మంది రాజకీయ ప్రముఖులను విడిచి పెట్టడం వివాదాస్పదమైంది. చివరికి రథయాత్ర మూల పురుషుడు అద్వానీని కూడా పిలవలేదు. మందిర నిర్మాణ ఉద్యమంలో బిజెపితో కలిసి నడిచిన శివసేనను ఆహ్వానించకపోడం ఆ పార్టీని అసంతృప్తికి గురి చేసింది. ప్రాణ ప్రతిష్ఠ సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతున్నదని భావించి శంకరచార్యులు నలుగురూ దూరంగా ఉన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా విగ్రహ ప్రతిష్ఠాపనను చేపట్టారన్న విమర్శ కూడా వచ్చింది. ఎవరు ఏమనుకున్నా వరుసగా మూడోసారి మరింత సంఖ్యాధిక్యతతో దేశాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యసాధన కోసం, ప్రధాని మోడీ ప్రతిష్ఠను ఉవ్వెత్తుకు లేపే పథకంతో ఈ ఘట్టాన్ని జరిపించారు.

ఈ సందర్భంగా దక్షిణాది నుంచి వినవచ్చిన సెక్యులర్ అభిప్రాయాలు గమనించదగినవి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి వివాదాన్ని రేకెత్తించిన తమిళనాడు పాలక పక్షం డిఎంకె కూడా తాము ఏ మత విశ్వాసానికి గాని, అయోధ్యలో ఆలయ నిర్మాణానికి గాని వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అయితే మసీదు స్థలంలో గుడిని నెలకొల్పడమే తమకు అంగీకారం కాదని వెల్లడించింది. కర్నాటక కాంగ్రెస్ పాలకులు మతం వ్యక్తిగతం మాత్రమేనని ఉద్ఘాటించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న రోజును రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించాలన్న డిమాండ్‌కు స్పందిస్తూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇలా అన్నారు ‘మా భక్తిని, దేవుని యెడల మాకున్న గౌరవాన్ని, మతాన్ని మేము ప్రచారంలో పెట్టబోము. మా మంత్రులు ఆలయాల్లో పూజలు చేస్తారు. మా ప్రార్ధనలు ఫలిస్తాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరులో రాముడున్నాడు, నా పేరులో శివుడున్నాడు. మాకు ఎవరూ బోధించనక్కరలేదు, మా విధిని మేము నిర్వర్తిస్తాము’ శివకుమార్ పలికిన ఈ పలుకులు మత సామరస్యానికి పట్టంగట్టే భారతీయ ఆత్మను ప్రస్ఫుటంగా ధ్వనిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News