దుబాయ్ : 2022లో ఇరాన్ దేశ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో మరో వ్యక్తికి ఇరాన్ మంగళవారం ఉరిశిక్ష అమలు చేసింది. తలపై హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో అరెస్టయిన యువతి తరువాత మృతి చెందడంతో ఇరాన్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆ ఆందోళనల్లో నేరాలకు పాల్పడ్డారని చాలా మందిని ఇరాన్ అరెస్ట్ చేసింది. అలాంటి వారిలో హత్యకు పాల్పడిన ఒకరికి మంగళవారం ఉరిశిక్ష అమలు చేసింది.
2022లో నెలరోజుల పాటు ఆందోళనలు సాగాయి. 529 మంది హత్యకు గురయ్యారు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపాన పరాండ్ పట్టణంలో ఆందోళన కారులు సాగించిన ర్యాలీలో నిందితుడు మొహమ్మద్ కోబడ్లు తన కారుతో తొక్కించి ఒక పోలీస్‌ను హత్య చేయడమే కాక, మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచాడని, ఆ తరువాత కారులో పరారయ్యాడని నేరారోపణపై అరెస్ట్ అయ్యాడు. 23 ఏళ్ల కోబడ్లు విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీనిపై కోబడ్లు తనకు పడిన మరణశిక్షపై అపీలు చేయగా దిగువ కోర్టు శిక్ష తగ్గించింది. కానీ సుప్రీం కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ విధంగా మరణశిక్షకు గురైన వారిలో తొమ్మిదో వ్యక్తి కోబడ్లు.