Saturday, November 23, 2024

పార్టీ అవకాశం ఇస్తే నా కుమారుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు

- Advertisement -
- Advertisement -

నాలుగైదు రోజుల్లో ఎంపి సీట్ల ఎంపిక కొలిక్కి వస్తుంది
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు…ఇప్పడు వేరు
ప్రస్తుతం పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడం ముఖ్యం
బిఆర్‌ఎస్ అధిష్టానంపై నేను అసంతృప్తిగా లేను : శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన చైర్మన్

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఆదేశిస్తే తన కుమారుడు అమిత్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. లోక్‌సభ సీట్ల ఎంపిక నాలుగైదు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ‘పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు…ఇప్పడు పోటీ చేయడం వేరు’ అని పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం ప్రధానమని, అదే తమ ఆలోచన అని వ్యాఖ్యానించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ నిర్ణయం మేరకు భువనగిరి, నల్లగొండ స్థానాల్లో ఎక్కడైనా తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు. నల్లగొండలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయని, అయినా పార్టీ ఆదేశిస్తే అక్కడి నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా అమిత్ రెడ్డి బరిలో ఉంటాడని అన్నారు.
ఓటమికి ఎవరో వ్యక్తులు కారణం కాదు
ప్రస్తుతం పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడం ముఖ్యమని గుత్తా అన్నారు. రాష్ట్రంలో గాలి వచ్చింది పార్టీ అధికారం కోల్పోయిందని, వాతావరణం తప్ప ఓటమికి ఎవరో వ్యక్తులు కారణం కాదని తెలిపారు. తాను బిఆర్‌ఎస్ అధిష్టానంపై ఏమాత్రం అసంతృప్తిగా లేననని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి పనులు చేసిన మంత్రులు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఒక వేళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారబోమని స్పష్టం చేశారు. నల్లగొండలో ఎంఎల్‌ఎల ఓటమికి తాను కారణం అయితే.. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓటమికి కారణం ఎవరు..? అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో తనకు కొంతమంది నాయకులతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరితో ఒకరితో పోటీ ఉంటుందని, ఒకరు పోతే ఇంకొకరు వస్తారని అన్నారు. రాజకీయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎవరూ ఉండరని అన్నారు. అమిత్ రెడ్డి జిల్లా నేతలను అందరినీ కలిశారని చెప్పారు. పార్టీ అన్ని అంశాలు చూసుకుంటుందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సిఎం, మంత్రులు చేయాల్సిన పనులు చేయాలని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతానని చెప్పారు. తనకు 2027 నవంబర్ వరకు పదవీ కాలం ఉంది అని, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తానని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంటుందని తెలిపారు. తాను కెటిఆర్‌ను కలిసినపుడు అమిత్ రెడ్డికి టికెట్ అంశం చర్చకు వచ్చిందని, త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని అన్నారు.
నదీ జలాలే ప్రధాన అంశంగా తెలంగాణ ఉద్యమం జరిగింది
కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం, సాగర్ పోతే తెలంగాణకు గొడ్డలి పెట్టు అని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ, పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. నదీ జలాలు ప్రధాన అంశంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని. తమ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూర్తి బాధ్యత తీసుకొని త్వరగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News