మాస్కో : 74 మందితో వెళ్తున్న రష్యా సైనిక రవాణా విమానం (ఐఎల్ 76) ఉక్రెయిన్ సరిహద్దుల్లో కుప్పకూలడంతో అందులోని 65 మంది యుద్ధఖైదీలు మృతి చెందారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపం లోని బెల్గోరాడ్‌లో ఈ ప్రమాదం సంభవించిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ చెప్పారు.
తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నట్టు తెలిపారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకోడానికి స్పెషల్ మిలిటరీ కమిషన్ సంఘటన స్థలానికి వెళ్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా సజీవంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపు తప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్టు కనిపిస్తోంది. తర్వాత ఇది నివాస ప్రాంతాల వద్ద నేలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.