Monday, December 23, 2024

స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్

- Advertisement -
- Advertisement -

భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే ఏడాది తర్వాత విముక్తి పొందిన చైనా ఆర్థిక, వాణిజ్య రంగాలలో ఎంతో పురోగతి సాధించి రాజకీయంగా కూడా అమెరికా వంటి అగ్రదేశంతో పోటీపడుతూ ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్నది. మన పాలకులు కూడా చైనాను అనతి కాలంలో అధిగమిస్తామని అంటున్నారు గానీ తయారీ రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన సాధనకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలీకృతం కాలేదు.

భారత్‌లో తయారీ అనే ఆకర్షణీయమైన నినాదం ఇస్తున్నా ఆశించిన పురోగతిలేదు. ఇప్పటికీ చైనా తదితర దేశాల నుండి ఎలెక్ట్రిక్, ఎలక్ట్రానిక్, యంత్రాలు, మందులు, ఔషధాల తయారీలో వాడే పరికరాలను, పదార్థాలను దిగుమతి చేసుకుంటూనే వున్నాము. జనవరి 26న మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ పూర్వరంగంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలనే సంకల్పాన్ని ఏలికలు వ్యక్తం చేశారు. సమున్నత లక్ష్యం అభినందనీయమే. అయితే అందుకు ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా వాణిజ్యం, సేద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుత ప్రగతిని సాధించవలసి ఉన్నది.

మన ప్రభుత్వాలు, పాలకులకు దార్శనిక దృక్పథంతో ఆర్థిక, సామాజిక అభివృద్ధి, పర్యావరణ సుస్థిరత, సమ్మిళిత సుపరిపాలన అందించడం ఎంతో ముఖ్యం. దేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలు, బాలబాలికలకు సరైన పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్యను అందించడం, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణను కల్పించాల్సి ఉంది. పేదలు, మహిళలు, యువత, రైతులే పేద కులాలని, వారి అభ్యున్నతే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ వక్కాణిస్తుంటారు. అయితే వీరు గౌరవప్రదంగా జీవించగలిగే పరిస్థితులు ఉన్నాయా అనేదే ప్రశ్న. తన పదేళ్ల పాలనలో దేశంలో 25 కోట్ల మంది దారిద్య్రరేఖను అధిగమించి మెరుగైన జీవితాలు గడుతున్నారని ప్రధాని మోడీ ప్రకటించారు.

నీతిఆయోగ్ కూడా 24.82 కోట్ల మంది ప్రజలు దుర్భర జీవితాల నుండి మెరుగైన జీవిత ప్రమాణాలను సాధించినట్లు నీతిఆయోగ్ కూడా ధ్రువీకరించింది. జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక, ఎన్‌ఎంపిఐ ఆధారంగా ఈ గణన జరిగింది. యుయుఎన్‌డిపి దారిద్య్ర గణనలో ప్రజారోగ్యం, పౌష్ఠికాహారం, శిశుమరణాలు, విద్య, పాఠశాల ఎన్నేళ్ళు చదివారు, హాజరు ఎలా వున్నది? వంటగ్యాస్, పారిశుద్ధ్యం, మంచినీరు, గృహవసతి, ఆస్తుల వంటి జీవన ప్రమాణాల ఆధారంగా వారు దారిద్య్ర రేఖను దాటారా లేదా అని నిర్ధారిస్తారు. నీతిఆయోగ్ బహుముఖ దారిద్య్ర సూచికల ఎన్‌ఎంపిఐ మేరకు తల్లుల ఆరోగ్యం, వారికి బ్యాంకు ఖాతాలున్నాయా లేదా అనే మరో రెండు అంశాలను చేర్చి, 12 అంశాల ప్రాతిపదికగా దారిద్య్రాన్ని గణిస్తారు. సంప్రదాయకంగా గృహస్థుల ఆదాయం, వినియోగం ప్రాతిపదికగా జరిగే దారిద్య్ర గణన కంటే ఎన్‌ఎంపిఐ పద్ధతి మెరుగైనదని నీతిఆయోగ్ భావిస్తున్నది.

ఆదాయం, వినియోగం ప్రాతిపదిక కంటే ఈ 12 సూచికల ఆధారంగా దారిద్య్రాన్ని మదింపు పద్ధతి అనేది విస్తృత ప్రజా బాహళ్యపు స్థితిగతులను మెరుగుపరచగలిగితే అదే పద్ధతి మేలనే అభిప్రాయాలున్నాయి. ఇది ప్రధానంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చేసే ఖర్చు లేదా పెట్టుబడిపై ఆధారపడి వుంటుంది. అయితే కుటుంబాల ఆదాయం ఎంత అనేదీ ముఖ్యమైనదే. మరుగుదొడ్ల వంటి పారిశుద్ధ్య సౌకర్యాలు, పిల్లలు పాఠశాలలకు వెళ్ళడం, ఆ కుటుంబాలకు బ్యాంకు ఖాతా ఉండటమూ ముఖ్యమే. నాణ్యమైన విద్యాసౌకర్యాలు లేకుంటే పిల్లలను పాఠశాలలకు పంపడం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరదు. నాణ్యత లేని విద్యా వ్యవస్థ నిరుద్యోగుల సంఖ్య పెంచుతుందే తప్ప ప్రయోజనం లేదు. అల్పాదాయ వర్గాలకు బతుకే కష్టమైనప్పుడు పొదుపు చేయగల మిగులు ఆదాయం లేకుండా బ్యాంకు ఖాతాలు ఉన్నా ఉపయోగం లేదు.

కాగా విద్య, ఆరోగ్యం, వంటగ్యాస్ వంటి సౌకర్యాల కల్పన ద్వారా అమలు చేసే అభివృద్ధి నమూనా వల్ల ప్రజల ఆదాయాలు, జీవన నాణ్యత మెరుగుపడుతుందా అనేది మరో అంశం. ప్రజల ఆదాయ స్థాయిలను బట్టి దారిద్య్ర స్థాయిని లెక్కించే పద్ధతి బదులు దారిద్య్రరేఖను అధిగమించిన వారి సంఖ్యను ఎక్కువ చేసి చూపడానికే ప్రభుత్వమే ఎన్‌ఎంపిఐ పద్ధతిని తీసుకొచ్చిందనే విమర్శలు గమనార్హం. కుటుంబాలకు దారిద్య్రరేఖను అధిగమించడానికి అవసరమైన ఆదాయమూ, దేశంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్య తీరినపుడే, కార్మికులు, ఉద్యోగుల నిజ వేతన స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ప్రజల సాధకబాధకాలను పరిష్కరించినపుడే, ప్రజల ఆర్థిక, సామాజిక, బౌద్ధిక స్థాయిలు మెరుగైనపుడే, జీవన నాణ్యతలు మెరుగుపడినపుడే, అంతర్జాతీయ స్థాయిలో మన యువత పోటీలో నిలిచి అందరికన్నా మిన్నగా ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించినపుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతుంది. ప్రజల నిజ ఆదాయాలు పెరిగినపుడే అది సాధ్యం.

భారత్‌లో ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన దుర్భర జీవితం గడుపుతున్న వారి సంఖ్య 16 కోట్ల వరకు ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా. 2017 నాటికి దేశంలో తలసరి ఆదాయం 2.15 డాలర్లుగా ఉన్నవారి కొనుగోలు శక్తి ప్రాతిపదికగా తీసుకుని ప్రపంచ బ్యాంకు ఈ నిర్ధారణకు వచ్చింది. వీరంతా ఆదాయ, వినియోగాలను బట్టి గాని లేదా ఎన్‌ఎంపిఐ ప్రాతిపదికగా ఏతీరున లెక్కించినా దారిద్య్రం నుండి బయటపడినప్పుడే భారత్‌లో రామరాజ్యం వచ్చిందనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పేదల్లో అత్యధికులు పల్లెల్లో ఉంటూ సేద్యం, వ్యవసాయేతర పనుల ద్వారా కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. అధికారం నెరపిన యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాల హయాంలో ఈ పేదల స్థితిగతులు మెరుగుపడ్డాయా అని పరిశీలించాల్సి వుంది.

2004 నుండి 2009 వరకు దేశాన్ని ఏలిన యుపిఎ 1 ప్రభుత్వ హయాంలో కూలీ ఏటా 0.2 % పెరగ్గా, వ్యవసాయేతర వేతనాలు 0.9% తగ్గినట్లు ఆర్థిక నిపుణుల అంచనా. కాగా యుపిఎ 2 ప్రభుత్వం అధికారంలో ఉన్న 2009- 14 కాలంలో వ్యవసాయ వేతనాలు 8.6 %, వ్యవసాయేతర వేతనాలు 6.9% పెరిగినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ఎన్‌డిఎ 1 కాలంలో 2014 19 మధ్య ఏటా వ్యవసాయేతర వేతనాలు 3% తగ్గినట్లు తేలింది. ఎన్‌డిఎ 2 హయాంలో 2019- 24 మధ్య సేద్యపురంగ నిజ వేతనాలు 0.6%, గ్రామీణ వ్యవసాయేతర వేతనాలు కరోనా మహమ్మారి ప్రబలిన కారణంగా 1.4 శాతం తగ్గినట్లు వెల్లడైంది. మన దేశంలో 1951 నాటికి దాదాపు 70% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించేవారు.

2011 నాటికి వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య 55 శాతానికి తగ్గినట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. అయితే సేద్యంపై ఆధారపడి బతికే వారి సంఖ్య 2019 నాటికి 42.5 శాతానికి తగ్గడం గమనార్హం. అయితే 2019- 20లలో దేశంలో కరోనా మహమ్మారి ప్రబలి లాక్‌డౌన్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల మూసివేత వల్ల నగరాలు, పట్టణాలలో పని చేస్తున్న లక్షలాది మంది వలస కార్మికులు బతికే దారి కానక మండుటెండల్లో కాలి నడకన పల్లెబాట పట్టారు. ఆ సంక్లిష్ట సమయంలో వారికి పని కల్పించి పొట్ట పోసుకోవడానికి ఆస్కారమిచ్చి నీడ కల్పించింది వ్యవసాయ రంగమే.

ఈ సంవత్సరాలలో మళ్లీ సేద్యపు రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య 2019లో 45.6 శాతానికి, 2020లో 46.5 శాతానికి పెరిగింది. 2021లో వారి సంఖ్య 45.5 శాతానికి తగ్గింది. ఎన్‌డిఎ 2 హయాంలో పల్లెల్లో కూలీల లభ్యత పెరిగినందున నిజ వేతనాలు తగ్గాయని అంచనా. యుపిఎ ప్రభుత్వ పదేళ్ల పాలనలో నిరుద్యోగిత రేటు 8.4%, ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో 7.9 శాతం ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాలను బట్టి తెలుస్తోంది.

పతకమూరు
దామోదర్ ప్రసాద్
9440990381

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News