Friday, November 22, 2024

భారత రత్నం

- Advertisement -
- Advertisement -

దేశ శిఖరోన్నత నాయకుల్లో ఒకరు, సామాజిక న్యాయజ్యోతి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు అత్యున్నత భారతరత్న అవార్డును ప్రకటించడం జాతి గర్వించదగిన పరిణామం. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించాలి. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు కూడా 1990 లో మరణానంతర అవార్డుగానే భారతరత్నను ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించిన విపి సింగ్ ప్రభుత్వం అంబేడ్కర్‌ను భారతరత్నతో సత్కరించగా, అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ చేసిన రెండు రోజులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్పూరీ ఠాకూర్‌కు దీనిని ప్రకటించింది. రామ్ మనోహర్ లోహియా అనుచరులైన సోషలిస్టు దిగ్గజాల్లో ఠాకూర్ ఒకరు. క్షురక వృత్తి చేసే మంగళ (నాయీ) కులస్థుడైన ఈయన బీహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు.

మొదటిసారి 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, రెండోసారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు, రెండూ పరిమిత కాల పదవులే అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు గణనీయమైనవి. అత్యంత జనహితమైనవి. అందుకే ప్రజలు ఆయనను జననాయకుడుగా పిలుచుకోడం ప్రారంభించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సొంత ఓటు బ్యాంక్‌ను సృష్టించిన ఎంబిసి రిజర్వేషన్లకు, మండల్ నివేదిక అమలుకు కర్పూరీ ఠాకూరే మూలపురుషుడు అనవచ్చు. 1978లో జనతా పార్టీ ముఖ్యమంత్రిగా కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత అణగారిన వర్గాలకు 26% రిజర్వేషన్లు కల్పించారు. దానికి ఆగ్రహించి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అగ్రవర్ణ యువత వీధుల్లోకి వచ్చి హింసాయుత ఆందోళన చేపట్టారు. ఠాకూర్‌ను వ్యక్తిగతంగా దూషించారు.

జనతా పార్టీలో భాగంగా ఉండి పాలక భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసంఘ్ మద్దతు ఉపహరించుకోడంతో ఠాకూర్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ విధంగా కర్పూరీ ఠాకూర్ దేశంలో సామాజిక న్యాయ సాధన యోధుడుగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా విశేష ఖ్యాతిని గడించారు. కర్పూరీ ఠాకూర్ ఉదంతం, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా వున్నప్పుడు తిరిగి సంభవించింది. ఆయన మండల్ కమిషన్ నివేదిక దుమ్ముదులిపి కేంద్ర ఉద్యోగాల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు అందుకు వ్యతిరేకంగా పరివార్ శక్తుల ఆధ్వర్యంలో అగ్రవర్ణ యువత పెద్దఎత్తున ఉద్యమాన్ని రగిలించడం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరణతో విపి సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఇంకొకవైపు ఎల్‌కె అద్వానీ రథయాత్ర మందిర్ ఉద్యమానికి దారితీసింది. ఉత్తరాదిలో సోషలిస్టు నేతలు లాలూ ప్రసాద్, ములాయం సింగ్‌ల నాయకత్వంలో మండల్ శక్తులు సంఘటితమయ్యాయి. ఇప్పుడు బిజెపి ససేమిరా ఇష్టపడని కుల జనగణనను బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విజయవంతంగా జరిపించింది.

ఉమ్మడి ఓటుతో బిజెపిని ఎదుర్కొని ఓడించాలని ఏర్పాటైన ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి) కూడా కులగణన నినాదాన్ని చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణనను జరిపిస్తానని హామీ ఇచ్చింది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చివరిసారిగా కుల ఆధార జనాభా లెక్కలను సేకరించిన తర్వాత ఇంతవరకు మళ్ళీ అది జరగలేదు. ఏ కులం వారు ఎంతమందో తెలియని పరిస్థితిలో తమకు చెందవలసిన ప్రయోజనాలను డిమాండ్ చేసి పరిపూర్ణంగా పొందే అవకాశం మూసుకుపోయిందని తమ ఓటు బలంతో అగ్రవర్ణాలు అధికారం చెలాయిస్తున్నాయని భావిస్తున్న వెనుకబడిన వర్గాల ప్రజలు ఇప్పుడు దానిని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. బీహార్‌లో ఒబిసిలు 60 శాతానికి పైగా ఉన్నట్టు కులగణన ద్వారా తేలింది.

అందుచేత దాని పట్ల దేశంలోని కింది వర్గాల ప్రజలు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.మందిర్ ఉద్యమం ద్వారా గడించుకొన్న ఒబిసి ఓటు బ్యాంకు కులగణన వల్ల తనకు దూరమవుతుందని భయపడుతున్న బిజెపి ఇప్పుడు అయోధ్యలో ఆలయ ప్రతిష్ఠాపనను దానికి విరుగుడుగా ప్రయోగించిందనే అభిప్రాయం కలిగింది. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటన కూడా ఎంబిసి ఓటు బ్యాంక్‌ను చీల్చి తనవైపు తిప్పుకోడానికేనని అనుకోడం సహజం. అతి దగ్గరలో గల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపును ఎంతమాత్రం వదులుకోరాదని, గతం కంటే ఎక్కువ స్థానాలతో వరుసగా మూడోసారి దేశాధికారాన్ని చేపట్టాలని బిజెపి పడుతున్న ఆరాటాన్ని ఇది ప్రతిబింబిస్తున్నది. ‘ఇండియా’ కూటమి ఉమ్మడి ఓటు వ్యూహం బిజెపిని ఎంతగా భయపెడుతున్నదో తెలుస్తున్నది. దేశంలోని అత్యధిక శాతం శ్రామికులు, సేవకులు, మెజారిటీ వర్గం అయిన బిసిల ప్రయోజనాలను ఆచరణలో దెబ్బతీస్తూ, మైనారిటీ అయిన అగ్రవర్ణాల డిమాండ్లను నెరవేరుస్తూ మతాన్ని ప్రయోగించడం, అత్యున్నత అవార్డులతో సత్కరించడం వంటి చర్యలతో ఒబిసిల ఓటును ఆకట్టుకోవాలనే కమలనాధుల వ్యూహం ఈసారి ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News