హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అసలు ప్రారంభమే కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపైన రేవంత్ రైతు భరోసా పేరుతో అబద్ధాలు చెపుతుంటే ఇక్కడ రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘అంతర్జాతీయ వేదికల పైన అబద్ధం చెప్పినట్టు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఉన్న రైతుబంధు ఇవ్వని రేవంత్ రెడ్డి లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పినం ప్రస్తుతం అదే జరుగుతుంది.
రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారు. ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కనపెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలి. కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ వాడలేదు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్తవి కట్టుకుంటాపోతే ఎట్లా? అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతుబంధుకు నిధులు వేయడానికి రావట్లేదు. ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దు అంటూ గతంలో కోర్టులో కేసు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపైన ఉపముఖ్యమంత్రి భట్టి మాటల దాడి చేశారు. తాజాగా భట్టి ఒక సమావేశంలో ఇదే తీరుగా మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు, మల్టి నేషనల్ కంపెనీల వలన సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన భూతద్దం వెతికి చూసిన కనిపించవు అంటూ ఉపముఖ్యమంత్రి భట్టి ఒకవైపు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఆదే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల కుదురుచుకుంటున్నారు.
మరి భట్టి విక్రమార్క ఎంఎన్‌సి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న రేవంత్‌రెడ్డిపైన మాట్లాడుతున్నారా భట్టి చెప్పాలె. భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చూస్తుంటే రేవంత్‌రెడ్డి దావోస్ ఎందుకు పోయిండ్రో చెప్పాలని ప్రశ్నించినట్లు ఉంది. ఇది ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపైన ఉప ముఖ్యమంత్రి భట్టి చేసిన మాటల దాడి లెక్క ఉంది. పది సంవత్సరాలపాటు అదానీని రాష్ట్రానికి వస్తామన్న రానివ్వలేదు. ఆదానీ పెట్టుబడులు మోడీకే లాభం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలి. ఒకవైపు రాహుల్ గాంధీ, అదానీని తిడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో ఒప్పందం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాలు కొనసాగించిన చరిత్ర లేదు. ఒకాయన నేనే నెంబర్ 2 అంటాడు. ఉప ముఖ్యమంత్రి భార్య మాత్రం మిగతా లీడర్లని పారాషూట్ లీడర్లు అంటుంది. ఇంకోయాన నా మాటనే చెల్లుతుంది అంటారు. ఇట్లా అనేక వైరుధ్యాల మధ్యన ఈ ప్రభుత్వం కొనసాగుతుంది.
కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎన్ని రకాల దృష్టి మరలచే ప్రయత్నాలు చేసినా 420 హామీల అమలు చేసేలా వెంటాడుతాం. గతంలో నేను దావొస్ పోయినప్పుడు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నామంటూ విమర్శలు చేశారు. మరి గతంలో మాట్లాడిన ఉత్తమకుమార్‌రెడ్డిలాంటోళ్లు దావొస్ బోగస్ అనే విషయం పైన ఇప్పుడు మాట్లాడాలి’ అని కెటిఆర్ డిమాండ్ చేశారు.
పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి
పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. త్వరలో 30,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 14 అసెంబ్లీ స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయామని తెలిపారు. మొన్న జరిగిన పార్లమెంటు సన్నాహక సమావేశంలో మంచి ఫీడ్ బ్యాక్ కార్యకర్తల నుంచి వచ్చిందని చెప్పుకొచ్చారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు ఇచ్చారని వెల్లడించారు. గతంలో జరిగిన కార్యక్రమాలపైన కూడా విమర్శనాత్మకమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వం పైన స్వల్ప కాలంలోనే పలు వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న వాళ్ళకి, ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే సహనం కూడా ఉండాలని సూచించారు.
రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నటువంటి మాటలు ప్రజలను మనసులు గాయపరుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చేందుకు చెప్పిన మాటలను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తుచేస్తున్నామని వెల్లడించారు. ఈరోజుకు కూడా రెండు ఎకరాలకు మించి రైతుబంధు పడడం లేదని గుర్తు చేశారు. 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న వారికి పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యల పైన పార్టీ తరఫున మాట్లాడదాం, వారి సమస్య లపైన ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతామని వెల్లడించారు. ఇంత స్వల్పకాలంలో అనేక వర్గాలను దూరం చేసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టుపెట్టేలా కెఆర్ ఎంబి అంశం పైన ప్రభుత్వం వ్యవహరిం చిందని విమర్శించారు. ఈ వ్యవహారం పైన శాసనసభలో చర్చించాల్సి ఉందని, అఖిల పక్షాన్ని వేయాల్సిందన్నారు. ఇలాంటి అన్ని అంశాల పైన కచ్చితంగా ప్రతిపక్షంగా మాట్లాడుతామని స్పష్టం చేశారు. కృష్ణ బేసిన్‌లో ఉన్న ప్రజల ప్రయోజనాలను కేంద్రంకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.
కొత్తగా వచ్చినామని చెప్తున్న ప్రభుత్వం మరి అడ్డగోలుగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. ఫార్మాసిటీ రద్దు, ఎయిర్‌పోర్టు మెట్రో రద్దు పైన ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలి, కనీసం కేబినెట్ సమావేశంలో కూడా చర్చించినట్టు లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటికీ కీలకమైన అంశం పైన ఏం జరిగిందో ప్రజలకు వివరించాలని సూచించారు. మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తునక లెక్క కాంగ్రెస్‌కు అప్పగించామని స్పష్టపర్చారు. కొంత సమయం ఇద్దామని కెసిఆర్ చెప్పారు కానీ. అడ్డగోలుగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైన మాట్లాడక తప్పడం లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు కెసిఆర్ పైన కుట్ర పనేందుకు జతకట్టాయని ఆరోపించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లోను ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఎన్నికల్లో కొట్లాడుతాయని, అందులో భాగంగానే బండి సంజయ్ మాట్లాడుతున్నా రన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా ఆదానితో జతకట్టారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పక్కన పెట్టిన విషయం ప్రజలకు తెలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి పైన భట్టి విక్రమార్క అసెంబ్లీలో తప్పుడు మాట చేప్పారన్నారు.
రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలైట్ బార్లు పెడతామంటోందని తెలిపారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదంటూనే కొండ సురేఖ నిన్న లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెబుతోందని గుర్తు చేశారు. పంటకు 500 బోనస్ మద్దతు ధర ఇస్తారా ఇవ్వరో చెప్పాలి అని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే జీవోలు ఇవ్వండని డిమాండ్ చేశారు. వంద రోజుల హమీలపైన అమలు ఇచ్చిన వాటిపైన జీవోలు ముందే ఇవ్వండన్నారు. 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీల అమలుపైన వెంటనే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది 2500 ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. హామీల అమలుపైన చేతులెత్తేస్తే ప్రజలు నిలదీస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కొట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నామని స్పష్టపర్చారు. శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆధ్వర్యంలో ఉన్నదన్నారు. శనివారం పార్టీ మైనార్టీ విభాగం సమావేశం ఉందని తెలిపారు. ప్రస్తుతం సర్పంచుల పాలన కాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలు మౌలిక వస్తువులను వెంటనే ప్రారంభిం చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంఛార్జీల పేరిట గ్రామాలలో నడిపించే కంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిన పనులెంటో వివరించాలని, బండి సంజయ్ చెప్పిన అంశాల పైన మా సీనియర్ నాయకులు వినోద్ తో కరీంనగర్లో ఎక్కడ చర్చకు వస్తారో చెప్పాలి అని కెటిఆర్ సవాల్ విసిరారు.