గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెస్‌లది ఫెవికాల్ బంధమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎంఎల్‌సిలుగా నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీచేసిన కోదండరాంను ఏరకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్‌భవన్ నడుస్తున్నదన్న విషయా న్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. గవర్నర్ సిఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు నేడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపికిఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా? అనే విషయం చెప్పాలన్నారు.
ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కును తెలియజేస్తుందని వెల్లడించారు. సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడగించాలి కానీ ప్రత్యేక ఇన్‌చార్జీలను పెట్టవద్దొన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలనచేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. కరోనా సమయంలో రెండేండ్ల పాటు సర్పంచుల పరిపాలన సమయం పోయిందని, కాబట్టి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మేర పొడిగించాలని లేదా ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలన్నారు. కేవలం మంత్రులు అందుబాటులో లేరు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అందుబాటులో లేరంటూ సర్పంచులు పూర్తిచేసిన కార్యక్రమాల ప్రారంభాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని విమర్శించారు.
మంచి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మారరని పెద్దలు ఎప్పుడో చెప్పారని సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రేవంత్ అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే.. వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారని ఎద్దేవాచేశారు. బిఆర్‌ఎస్సే ఇంకా అధికారంలో ఉందనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. చేతనైతే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలుపర్చాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవన్నారు. ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేవరకు వెంటాడుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు ప్రజలందరికీ తెలుస్తున్నదన్నారు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎంఎల్‌సిలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారన్నారు. ఒకటే కోటా కింద ఉన్న ఎంఎల్‌సిలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవగానే ఒకే ఎన్నిక కాకుండా వేర్వేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారని చెప్పారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బిఆర్‌ఎస్‌కు, మరొకటి కాంగ్రెస్‌కి వచ్చేదని వెల్లడించారు. బిజెపి జాకీలు పెట్టి కాంగ్రెస్‌కి మద్దతుగా నిలుస్తున్నదని విమర్శించారు. ఇరు పార్టీల ఫెవికాల్ బంధమని ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్, బిజెపి కొట్లాడుకోవద్దు బిఆర్‌ఎస్‌ని అంతం చేద్దామన్నారు. గురువారం గుంపు మేస్త్రి కూడా అదే మాట అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.