మేడారంలో ముందస్తు మొక్కుల చెల్లింపులు
ఇప్పటికే భారీగా తరలివస్తున్న భక్తులు
6 వేల బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: మేడారంలో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసి 6 వేల బస్సులను నడుపనుంది. జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేడారం మాహాజాతరకు గత జాతరకు 3500 బస్సులను నడిపామని అధికారులు తెలిపారు. ఈ సారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాటికి అదనంగా మరో 2500ల బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసి అధికారులు వివరించారు.
జనసంద్రంగా ఆలయ పరిసరాలు
సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. వన దేవతల గద్దెలు భక్తజనంతో కిటకిట లాడుతున్నాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో, అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయడంపై దృష్టి సారించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్దిగాంచింది. ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. వచ్చే నెలలో మహాజాతర జరుగనుంది. ఇప్పటి నుంచే నుంచే మేడారంలో భక్తుల తాకిడి మొదలైంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు.
ప్రధాన దారులపై కిక్కిరిసిన వాహనాలు
తొలుత సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం మేడారం బాట పడుతున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు, కుంకమలు, గాజులు, చీర సారె వనదేవతలకు సమర్పిస్తారు. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలోని జంపన్నవాగు, చిలకలగుట్ట, నార్లపూర్ తదితర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తులతో మేడారంలోని ప్రధాన దారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి. రోజూ లక్షమందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.