Saturday, December 21, 2024

సిఎం రేవంత్ రెడ్డి జన రంజకమైన పాలన అందిస్తున్నారు: మోత్కుపల్లి నర్సింహులు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం నెల రోజుల పాలన చూస్తుంటే సంతోషంగా ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు సాగుతోంది
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం రేవంత్ రెడ్డి జన రంజకమైన పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలన చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావనను కల్పిస్తుందన్నారు. భవిష్యత్‌లోనూ పాలనను ఇలాగే కొనసాగించాలని మేధావులు, ప్రజా సంఘాల నేతలతో సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రి, పగలు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజా పాలనలో తన వంతు పాత్ర నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. తన అనుభవాన్ని సలహాలను ప్రభుత్వానికి ప్రజలకు ఇవ్వడానికి తాను ఎప్పుడు సిద్ధమేనన్నారు.

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ఆటలు ఇక తెలంగాణలో సాగవని మొత్తం తెలంగాణలో పార్లమెంట్ సీట్లు అన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ మాదిగలంతా ముక్త కంఠంతో కెసిఆర్‌కు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రజల వద్దకు పాలనగా రేవంత్ ప్రభుత్వం నడుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు కెసిఆర్ కుట్రలకు బలయ్యారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త గిరెడ్డి ముకుంద రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ సగరపు ప్రసాద్, తెలంగాణ యువ నాయకులు మాతంగి శ్రీనివాస్, జననేత జనతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News