Thursday, December 5, 2024

త్వరలోనే మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకం అమలు

- Advertisement -
- Advertisement -

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే నిరుపేద విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి
అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదన్న దృష్టితో ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ శుభవార్త చెప్పబోతున్నారు. అందులో భాగంగానే మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్ సీస్ స్కాలర్‌షిప్ పథకం అమలుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు సిఎం రేవంత్ అధికారులకు ఈ పథకానికి సంబంధించి విధి, విధానాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్‌ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి పక్కాగా పథకాన్ని అమలు చేయాలని సిఎం అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా నిరుపేద విద్యార్థులకు ఈ పథకం కింద మొదటి ప్రాధాన్యమివ్వాలని అధికారులను సిఎం ఆదేశించినట్టుగా తెలిసింది.
రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం
మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ సమాజంలోని వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెంది విదేశాల్లో చదువుకోవాలనుకునే తెలంగాణ ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఒక అవకాశ కార్యక్రమం. ఈ మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రారంభించింది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.5,00,000 కంటే తక్కువ ఉన్న విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో…
ఈ స్కాలర్‌షిప్ ఎంపికైన విద్యార్థికి అధిక మొత్తంలో వారి ఉన్నత విద్య కోసం రూ. 20,00,000లను ప్రభుత్వం అందించనుంది. విద్యార్థులకు ఈ భారీ మొత్తాన్ని 2 వాయిదాల్లో అందించాలని నిర్ణయించింది. యూఎస్, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా లేదా సింగపూర్‌లో విద్య కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపిక కావాలనుకుంటే, TOEFL/ IELTS/ GRE లేదా GMATలో కొన్ని కనీస మార్కులను స్కోర్ చేసి ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://telanganaepass.cgg.gov.in/దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
గరిష్ట వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ…
అయితే ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపిక కావడానికి విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అందులో భాగంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసితులై ఉండాలి.
విద్యార్థులు రాష్ట్రంలోని వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5,00,000లకు మించకూడదు. సంవత్సరం జూలై 1 నాటికి, పథకం కింద అనుమతించబడిన గరిష్ట వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎంపిక చేసుకునే సమయంలో, విద్యార్థి మునుపటి సంవత్సరం పరీక్ష స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు గత సంవత్సరం నుంచి పరీక్షలో సాధ్యమయ్యే పాయింట్లలో కనీసం 60 శాతం పొంది ఉండాలి. గుర్తింపు పొందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి విద్యార్థి సెలక్ట్ అయి ఉండాలి. ఈ పథకం బిసితో పాటు ఓబిసి విద్యార్థులను ఉద్ధేశించి పెట్టింది. మహిళా విద్యార్థులకు సమాన భాగస్వామ్యం కల్పించేందుకు బాలికల సంఘాలకు 33 శాతం కోటాను ప్రభుత్వం కేటాయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News