కరీంనగర్: మహిళా కళాశాల విద్యార్ధినుల కోసం రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశాని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ తెలిపారు. దీనివల్ల కరెంట్, మంచి నీటి ఇబ్బందులు తొలుగుతాయని, త్వరలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కేంద్ర నిధులతో ప్రత్యేక హాస్టల్ నిర్మించేందుకు కృషి చేస్తానని వివరణ ఇచ్చారు. అంతేగాదు, కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీని టాప్ కాలేజీగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్మాణానికి సిఎస్సార్ కింద కేంద్ర నిధులు మంజూరు చేయిస్తానని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ రోజు ఉదయం కరీంనగర్ లోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్ ఎంపి నిధుల కింద రూ.10 లక్షలతో నిర్మించిన సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్ ను పరిశీలించారు. సోలార్ పవర్ వల్ల మంచి నీళ్లు, కరెంట్ సహా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతోందన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. విద్యార్థులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఉద్యోగం కోసమే చదువుకోవాలనే ఆలోచన వద్దని, చదువు కెరీర్ తోపాటు సంస్కారం, సంస్కృతి, లక్ష్య సాధనకు ఉపయోగపడాలని, భారతీయుడిగా పుట్టడం నిజంగా పూర్వ జన్మ సుకృతం అని, విదేశీయులే భారత సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారని, మనం మాత్రం మమ్మీ డాడీ సంస్కృతికి అలవాటుపడటం బాధాకరమైన విషయమన్నారు. మమ్మీ, డాడీ విదేశీ సంస్కృతి మనకు వద్దని, ప్రతి ఒక్కరం దేశం, ధర్మం కోసం పనిచేయాలని బండి సంజయ్ సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
సర్పంచులు వచ్చే వారం నుండి ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చూశానని, సర్పంచుల పోరాటం న్యాయమైనదని, మా పార్టీ నాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తానని వివరణ ఇచ్చారు. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం వచ్చే నెల 1న ముగియబోతుందని, సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఝప్తి చేశానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, సర్పంచులకు చేసిన మోసాలను సరిదిద్దాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, లేనిపక్షంలో బిఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.
చాలామంది సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై కూలీలుగా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే దుస్థితి ఏర్పడిందని, చాలా చోట్ల సర్పంచులు చేసిన పనులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర కెసిఆర్ ప్రభుత్వానికి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కెసిఆర్ ప్రభుత్వంపై కేసు పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కెసిఆర్ కుమారుడు కెటిఆర్ తనపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, కెసిఆర్ కు సిఎం పదవి ఎందుకు? అని, బార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా? విమర్శలు గుప్పించారు. నువ్వు మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నవ్ కదా.. హిందూ ధర్మమంటే కెటిఆర్ గిట్టదని, మసీదు పెట్టుకోవాలని, కెటిఆర్ కు రాజకీయాలెందుకు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 99 శాతం మంది దేవుడిని నమ్మేవాళ్లున్నారని, తానడుగుతున్నానని, కెటిఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడు అని బండి సంజయ్ మండిపడ్డారు. దేవుడిని నమ్మేవాళ్లు నాస్తికుడికి ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలన్నారు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కెటిఆర్ అని దుయ్యబట్టారు. ఇకనైనా తెలంగాణకు పట్టిన దరిద్రం కెసిఆర్ కుటుంబం అని, బిఆర్ఎస్ అరాచకాలను, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బిజెపినేనని చెప్పారు.
కారు సర్వీసింగ్ కు పోయిందట, తాగి కారు నడపడంతోనే షెడ్డుకు పోయిందని చురకలంటించారు. రిపేర్ కు కూడా పనికిరాకుండా పోయిందని, పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు దమ్ముంటే బిఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని నిలదీశారు. తాము రాబోయే ఎన్నికల్లో మోదీ చేసిన అభివృద్ధిని, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిల్ ప్రజల్లోకి తీసుకెళతామని వివరణ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ది మూడో స్థానమేనని జోస్యం చెప్పారు.
మాజీ ఎంపి వినోద్ కుమార్ నాన్ లోకల్. ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదని, ఏనాడూ ప్రజలను కలవలేదని, ఎన్నికలొస్తున్నాయని తెలిసి డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరని, సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని హామీ ఇచ్చారు. ఇండియా కూటమి కుక్కల చింపిన విస్తరిలా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్డిఎ కూటమిలో చేరే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బిజెపిలో చేరే నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.