న్యూఢిల్లీ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ లోని ఆయన నివాసానికి సోమవారం వెళ్లారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారించడానికి ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29 లేదా 31న ఏదో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని, దీనికి స్పందించాలని ఈడీ కోరింది. ఢిల్లీ పోలీస్ అధికారులను వెంటబెట్టుకుని ఈడీ అధికారులు దక్షిణ ఢిల్లీ లోని 5/1 శాంతినికేతన్ భవనానికి సోమవారం ఉదయం 9 గంటలకు వెళ్లారు.
ప్రెస్ ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు, బయట వేచి చూశారు. సోరెన్ ఈడీకి సమాచారం పంపినప్పటికీ, విచారణకు తేదీ, సమయం నిర్ణయించలేదు. ఈనెల 27నే ఆయన రాంచీ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈ కేసులో మొదటిసారి జనవరి 20న ఈడీ రాంచీ లోని సోరెన్ ఇంటికి వెళ్లి ఏడు గంటల పాటు విచారించిన తరువాత సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే ఆరోజు విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అందుకే తాజాగా సమన్లు ఈడీ జారీ చేసింది. ఈ కేసులో 14 మందిని ఈడీ అరెస్ట్ చేసింది.