Sunday, January 5, 2025

కుర్చీకోసం పందిట్లో పెళ్లి పెటాకులు!

- Advertisement -
- Advertisement -

కుర్చీకోసం రాజకీయ నాయకులు తన్నుకోవడమే ఇంతవరకూ చూశాం. కానీ చిన్నపాటి కుర్చీకోసం పెళ్లిళ్లు పెటాకులవుతాయని తాజాగా జరిగిన ఓ సంఘటనతో తెలిసివచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికూతురు తండ్రి మహ్మద్ ముబీన్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి… మగపెళ్లివారి బృందంలో ఓ ముసలామె ఉంది. పెళ్లికొడుక్కి ఆమె బామ్మ అవుతుంది. ఆ పెద్దావిడ తాను కూర్చునేందుకు ఓ కుర్చీ కావాలని కోరింది. కానీ ఆడపెళ్లివారు ఆమె అడిగిన వెంటనే   కుర్చీ వేయలేదట. ఆ విషయాన్ని బామ్మగారు పెళ్లికొడుక్కి చేరవేసింది. తన బామ్మకు కుర్చీ వేయలేదెందుకని పెళ్లి కొడుకు ఆడపెళ్లివారితో వాదనకు దిగాడు.

అతనికి తోడుగా అతని తమ్ముడు కూడా వచ్చాడు. ఇరువైపులా అరుపులు, కేకలూ మొదలయ్యాయి. అంతలో ఉన్నట్టుండి పెళ్లి కొడుకు తమ్ముడు ‘మీ అమ్మాయి మా అన్నయ్యను పెళ్లి చేసుకుని, మా ఇంటికి వస్తుందిగా, అప్పుడు చూపిస్తాం మా తడాఖా’ అన్నాడట. దాంతో ఆడపెళ్లివారు కూడా రెచ్చిపోయారు. గొడవ ఇలా కొనసాగుతుండగా ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ పెళ్లికొడుకు స్వయంగా ప్రకటించేశాడు. ఆడపిల్ల తరఫువారు కూడా తమకూ ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చేశారు. దాంతో పెళ్లి రద్దయింది. తిరిగి వెళ్లిపోయేందుకు మగపెళ్లివారు తట్టాబుట్టా సర్దుకుంటుంటే, పెళ్లి ఏర్పాట్లకు తాము చేసిన ఖర్చులు చెల్లించి మరీ వెళ్లాలని, అంతవరకూ కదలనిచ్చేది లేదని ఆడపెళ్ళివారు పట్టుబట్టారు. దాంతో డబ్బులు చెల్లించి, మగపెళ్లివారు అక్కడినుంచి కదిలారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News