Monday, January 20, 2025

మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి ఖురేషీకీ అదే ఖైడు
ప్రభుత్వ రహస్యాల వెల్లడి కేసు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్ ఖురేషికి ప్రభుత్వ రహస్యాలు వెల్లడించినందుకు ఇద్దరికీ చెరి పది సంవత్సరాల జైలు శిక్షను ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విధించింది. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అధికార రహస్యాల చట్టం కింద రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం కేసు విచారణ సమయంలో ఆ ఇద్దరు నేతలకు జైలు శిక్ష విధించినట్లు ప్రకటించింది.

అవినీతి కేసులో ఇప్పటికే దోషిగా నిర్ధారితుడైన తరువాత ఇమ్రాన్ ఖాన్ మూడు సంవత్సరాల జైటు శిక్ష అనుభవిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఐ) పలు సమస్యలు ఎదుర్కొంటున్నది. ఎన్నికల చిహ్నంగా క్రికెట్ బ్యాట్ తిరస్కరణ, ఇమ్రాన్, ఖురేషి తదితర పార్టీ నేతల నామినేషన్ పత్రాల నిరాకరణ వంటి చిక్కులను పార్టీ ఎదుర్కొంటున్నది. 2022 మార్చి 27న ఒక బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ చేతితో ఊపిన దౌత్యపరమైన కేబుల్ సైఫర్‌గా భావిస్తున్న సైఫర్ కేసు ఇది.

ఇమ్రాన్ ఖాన్ అమెరికా పేరు ప్రస్తావిస్తూ, తన ప్రభుత్వం కూల్చివేతకు ‘అంతర్జాతీయ కుట్రకు దాఖలా’ అని ఆ పత్రాన్ని పేర్కొన్నారు. 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 67 ఏళ్ల ఖురేషిలపై ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఎ) నిరుడు ఆగస్టు 15న కేసు దాఖలు చేసింది. 2022 మార్చిలో వాషింగ్టన్‌లో పాకిస్తాన్ రాయబార కార్యాలయం పంపిన కేబుల్‌ను ఉపయోగిస్తూ రహస్య చట్టాలను వారు ఇద్దరూ ఉల్లంఘించారని ఎఫ్‌ఐఎ ఆరోపించింది. ఈ పరిణామాన్ని పిటిఐ నేతలు ధ్రువీకరించారు. ‘మీడియా లేదా జనానికి వివరాలు ఇవ్వని బోగస్ కేసు’ ఇది అని వారు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News