న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నామినేట్ చేశారు. ఈమేరకు కేంద్రహోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సత్నామ్ సింగ్‌ను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. ఆయన గొప్ప విద్యావేత్త అని, సామాజిక కార్యకర్తగా అట్టడుగు వర్గాలకు సేవ చేస్తున్నారని అభివర్ణించారు.
దేశ సమైక్యత కోసం విస్తృతంగా పనిచేస్తున్నారని, ఆయన పార్లమెంటరీ ప్రయాణం ఉత్తమంగా సాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయన అభిప్రాయాలతో రాజ్యసభ కార్యకలాపాలు సుసంపన్నం అవుతాయని భావిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్‌కర్ తన అభినందనలో సత్నామ్ సామాజిక సేవ, విద్యా సేవపై ఉన్న అభిరుచి రాజ్యసభ ఉన్నతికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు
సంధూ విద్యాసేవ
పంజాబ్ లోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన సంధూ చిన్నతనంలో చదువు కోడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విధంగా తనలా ఎవరూ బాధలు అనుభవించకూడదన్న ఆవేదనతో 2001లో మొహాలీ ప్రాంతంలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను స్థాపించారు. 2012లో చండీగఢ్ యూనివర్శిటీని నెలకొల్పారు. 2023లో క్యూఎస్ వరల్డ్ రికార్డ్‌లో ఈ విశ్వవిద్యాలయానికి స్థానం లభించింది. ఆసియా లోనే అత్యుత్తమ ప్రైవేట్ వర్శిటీగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ యూనివర్శిటీకి సంధూ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెండు ఛారిటీ సంస్థల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు. విద్యారంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది.