Monday, December 23, 2024

రేపు సుప్రీంలో హేమంత్ పిటిషన్ విచారణ

- Advertisement -
- Advertisement -

మనీలాండరింగ్ కేసులో తననుఇడి అరెసు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనున్నది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత బుధవారం రాత్రి సోరెన్‌ను ఇడి అరెస్టు చేసింది. మొదట ఆయన తన అరెస్టును జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ అనుభ రావత్ చౌదరి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంలకు సోరెన్ పిటిషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉంది.

అయితే అనూహ్యంగా సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి సారథ్యంలోని న్యాయవాదుల బృందం ఈ కేసును హైకోర్టులో కాకుండా సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అరెస్టు చేసిన తీరు దేశ రాజకీయాలపై ప్రతికూల ప్రభావం చూపగలన్న కారణంతో హైకోర్టులో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి కపిల్ సిబల్ విన్నవించారు. అయితే సోరెన్ అభ్యర్థనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు అభ్యంతరం తెలిపారు.

ఈ పిటిషన్ విచారణ హైకోర్టులో విచారణకు రానున్నదని వారు పేర్కొన్నారు. సోరెన్ అరెస్టు కు సంబంధించిన సమయంతోపాటు ఇతర విధానపరమైన అంశాలపై కపిల్ సిబల్ అభ్యంతరం తెలియచేస్తూ ఇది చాలా తీవ్రమైన అంశమని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సోరెన్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. తాము పిటిషన్‌ను ఇంకా పరిశీలించాల్సి ఉన్నందున దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని సిజెఐ తెలిపారు. ఇరుపక్షాల న్యాయవాదులు శుక్రవారం తమ అస్త్రశస్త్రాలతో కోర్టుకు రావాలని ఆయన సూచించారు. ఇడి కొన్ని వేల మందిని అరెస్టు చేసిందని, వారంతా నేరుగా సుప్రీంకోర్టుకు ఎలా రాగలరని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News