న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ మోడీ ప్రభుత్వ అంతిమ బడ్జెట్‌గా కనపడుతోందని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కచ్ఛితంగా తమకు పూర్తి అనుకూలమని బిజెపి చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఇంకా చూడాల్సిన సినిమా చాలా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జిడిపిని పాలన, ప్రగతి, పనితీరుగా అభివర్ణించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వ పాలనలో జి అంటే ప్రభుత్వ జోక్యం, పన్ను ఉగ్రవాదం, డి అంటే ప్రజా విద్రోహం, పి అంటే పేదరికం, పెరుగుతున్న అసమానతలని అర్థమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో నిరుద్యోగ సమస్య కనిపించకపోవడం విస్మయకరమని ఆయన అన్నారు. సామాన్య ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచే విషయంలో మోడీ ప్రభుత్వానికి ఫెయిల్ మార్కులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.