మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి కాలం ప్రారంభంలోనే భానుడి భగభగలతో జనం చిర్రెత్తిపోయారు. గురువారం పగటి ఉష్ణోగ్రతలు మండు వేసవిని తలపించాయి. చలికాలం ఛాయలు ఇంకా తొలగిపోనేలేదు.అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వేసవి తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల కూడా రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే ఫిబ్రవరిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల వరకు నమోదయ్యేవి. కానీ ఈసారి 34 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి. గురువారం ముషీరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 34.9 డిగ్రీలు, గోల్కొండ 34 డిగ్రీలు, ఖైరతాబాద్ 35.1 డిగ్రీలు, ఆసిఫ్‌నగర్ 34.6 డిగ్రీలు, షేక్‌పేట 34.8 డిగ్రీలు, మెండా మార్కెట్ 34.5 డిగ్రీలు, చార్మినార్ 34.7 డిగ్రీలు, అమీర్‌పేట 35 డిగ్రీలుగా నమోదయ్యాయి.మరో రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈనెల మధ్యలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఈ నెల మధ్యలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ. శ్రావణి వెల్లడించారు. రాబోయే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని తెలిపారు. సగటున 31నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు. పగటిపూట ఎండలు తీవ్రమైనప్పటికీ రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.