విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్‌గా మారింది. ఉప్పల్‌లో జరిగిన మొదటి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత పటిష్టస్థితికి చేరుకోవాలనే లక్షంతో ఇంగ్లండ్ ఉంది. ఒకవైపు తొలి టెస్టులో ఎదురైన ఓటమి, మరోపక్క కీలక ఆటగాళ్లు గాయాల బారీన పడడం భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. ఉప్పల్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టులో టీమిండియా ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. యువ ఆటగాడు సర్ఫరాజ్ రాకతో భారత బ్యాటింగ్ కాస్త బలంగా మారిందనే చెప్పాలి. తుది జట్టులో చోటు కోసం పటిదార్‌తో సర్ఫరాజ్‌కు గట్టి పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరికీ జట్టులో స్థానం లభిస్తుందో అంతుబట్టడం లేదు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. సుదీర్ఘ నిరీఓణ తర్వాత అతనికి జాతీయ జట్టులో స్థానం లభించింది. ఒక వేళ తుది జట్టులో స్థానం లభిస్తే చెలరేగాలనే పట్టుదలతో అతను ఉన్నాడు.
బ్యాటింగే సమస్య..
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు బ్యాటింగే పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం వల్ల ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్ గాడిలో పడుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతను విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లి, రాహుల్, జడేజా వంటి సీనియర్లు అందుబాటులో లేని సమయంలో కెప్టెన్ రోహిత్‌పై బాధ్యత మరింత పెరిగింది. జట్టును ముందుండి నడిపించాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి రోహిత్‌కు ఏర్పడింది.
కాగా, తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిస్తేనే జట్టుకు భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. గిల్, అయ్యర్‌లకు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇందులో విఫలమైతే రానున్న రోజుల్లో జట్టులో స్థానం కాపాడుకోవడం వీరికి కష్టమేనని చెప్పాలి. ఇక అక్షర్ పటేల్, జడేజా, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ తదితరులు కూడా బ్యాట్‌తో రాణించక తప్పదు. బౌలింగ్‌లో అశ్విన్, బుమ్రా, సిరాజ్, అక్షర్‌లు జట్టుకు కీలకంగా మారారు. జడేజా దూరమైన నేపథ్యంలో ఎవరికీ తుది జట్టులో స్థానం లభిస్తుందో చెప్పలేం. బ్యాటింగ్, బౌలింగ్ సమస్యలతో సతమతమవుతున్న టీమిండియాకు విశాఖ మ్యాచ్ సవాల్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమరోత్సాహంతో..
మరోవైపు ఇంగ్లండ్ టీమ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఉప్పల్ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన స్టోక్స్ సేన ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే కీలక బౌలర్ జాక్ లీచ్ గాయంతో జట్టుకు దూ రం కావడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అతను లేకున్నా ఇంగ్లండ్ బౌలింగ్ బలంగానే ఉంది. ఓలి పోప్, ఫోక్స్, స్టోక్స్, రూట్, డకెట్, బెయిర్‌స్టో, క్రాలీ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అండర్సన్ చేరికతో బౌలింగ్ కూడా మరింత బలోపేతంగా తయారైంది. షోయబ్ బషీర్, టామ్ హార్ట్ లీ, రెహాన్, రాబిన్‌సన్‌లతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. రెండు విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.