పల్లె పాలన ప్రత్యేకాధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోనున్న అధికారులు
అభివృద్ది పనులు ప్రత్యేకాధికారి, కార్యదర్శులు చేపట్టాలి
ఇద్దరికీ జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సర్పంచ్‌ల పాలనకు తెరపడింది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం డిజిటల్ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌లు సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి స్వాధీనం చేసుకోనున్నారు.
ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగగా, ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం కల్పించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలుంటుంది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అధికారులు ఆయా మండలాలకు చెందిన ఎంపిడిఓ, తహసీల్దార్, ఎంపిఓ, డిటి, ఆర్‌ఐ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ఉన్నతాధికారులు నియమించారు. డిజిటల్ కీకి అధీకృత అధికారిగా ప్రత్యేక అధికారి ఉంటారు.డిజిటల్ కీ, చెక్కులు, రికార్డుల్లో ఏదైనా సమస్య వస్తే కార్యదర్శిదే బాధ్యతని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో ఉమ్మడిలో పాలనలో 2011 నుంచి 2013 వరకు, 2018 ప్రత్యేక తెలంగాణ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.