ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’ పేరుతో దేశంలోని రెండున్నర లక్షల పంచాయతీలను చుట్టి రావడానికి అత్యాధునికమైన 1500 వాహనాలను సిద్ధం చేశారు. ఈ వాహనాల్లో మోడీని కీర్తిస్తూ పాటలు, ఉపన్యాసాలు. భూమిపైన ఏం జరుగుతోందో శాటలైట్ ద్వారా పర్యవేక్షించడానికి జిపిఎస్ లు, డ్రోన్‌లతో సీనియర్ అధికారుల పర్యవేక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి ‘మోడీ హామీల వాహనం’ అన్న పేరు పెట్టారు. ఇందులో మోడీపైన మొత్తం వ్యక్తిగత ప్రచారమే. వాహనం పైన ‘భారత ప్రభుత్వం’ అని కాకుండా, ‘మోడీ ప్రభుత్వం’ అని ఎందుకు రాశారని చాలా చోట్ల ప్రజలు ప్రశ్నించారు. అహ్మదాబాద్, నాసిక్, సతారా, జల్‌నా, పర్‌బని, అకోల, హింగోలి, నాందేడ్, రత్నగిరి, బుల్‌ధన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు నిరసన తెలిపారు. మోడీ వాహనం పైన బిజెపి చిహ్నం ‘కమలం’ ఉండడాన్ని వారు ప్రశ్నించారు.దీనికి సాక్ష్యంగా ప్రజలు కొన్ని వీడియోలను ప్రదర్శించారు.
మోడీ ప్రచారానికి ప్రభుత్వ నిధులు వాడడం పైన ఢిల్లీలోని ఏడుచోట్ల అభ్యంతరం తెలిపారు. 1.‘ప్రజలు మోడీ హామీలను నమ్ముతున్నారు.ఎందుకంటే మిగతా పార్టీలు తప్పుడు హామీలు ఇస్తున్నాయి కనుక’ అని మోడీ అన్నారు. 2. ‘నా పట్టుదలకు, నా అంకిత భావానికి, నేను కష్టపడి పని చేయడానికి ప్రతిరూపాలే నా హామీలు’ అని మోడీ తనను తాను కీర్తించుకున్నారు. 3.‘ఎక్కడైతే నమ్మకాలు సడలిపోతాయో, అక్కడే మోడీ హామీలు మొదలవుతాయి’ అని మోడీ మరొకమాట. 4. ‘మోడీ హామీలు అంటే, మోడీ మాత్రమే నెరవేర్చగలుగుతారు అని ప్రజలు విశ్వసిస్తున్నారు’ అని మోడీ తనను తాను కీర్తించుకున్నారు.5. ‘మోడీ హామీలు ఘనంగా విజయవంతమయ్యాయి’ అని వారణాసిలో మోడీ ప్రకటించుకున్నారు. 6. త్రిశూర్‌లో జరిగిన ప్రదర్శనలో మోడీ మాట్లాడిన 19 నిమిషాల్లో తన హామీలను మోడీ 18 సార్లు పునఃస్మరణ చేశారు.
గత పదేళ్ళుగా ఆయన ఎన్ని పథకాలు ప్రకటించారో ఎవరికీ తెలియదు. ఈ రచయిత 142 పతకాలని లెక్కకట్టారు. అధికారిక లెక్కల ప్రకారం 201516 మధ్య 40 పథకాలను ప్రకటించారు. ప్రధాన మంత్రి పేరుతో ప్రధాన మంత్రి కిసాన్, ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన లాగా కనీసం 20 పథకాలను ప్రకటించారు.
మోడీకి అత్యంత ఇష్టమైన ‘అమృత్’ అన్న పేరుతో ‘అమృత్ కాల్’, ‘అమృత్ భారత్ రైళ్ళు’ అనే పథకాలున్నాయి. మోడీ పథకాలను అంచనా వేయడానికి అధికారికి లెక్కలు లేవు. తమపై అంచనాలను పెంచుకోవడానికి ప్రధాని, వారి మంత్రివర్గ సహచరులు చెప్పేవన్నీ నిరాధారాలే. ప్రధాన స్రవంతిలోని పత్రికారంగమంతా 2017 18 నుంచి విమర్శనాత్మకమైన వార్తలను, కథనాలను రాయడం నిలిపివేసింది. మోడీ ‘హామీల’ అమలు, వాటి మంచి చెడులు ఎక్కడా పరిశీలించలేదు. మోడీకి ఇష్టమైన గంగానదిని శుద్ధి చేసే పథకం పేరును 2014లో ‘నమామి గంగ’గా మార్చారు. ఇరవై వేల కోట్ల రూపాయల ఈ పథకంలో 2021 నివేదిక ప్రకారం కేవలం 20% మాత్రమే పూడిక తీసే పని జరిగింది. గంగా నదిని శుభ్రంచేసే జాతీయమిషన్ అంచనా ప్రకారం 2026 నాటికి గానీ 7వేల లీటర్ల మురుగును తొలగించలేరు. పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాని మానస పుత్రికైన ఈ పథకం అదృష్టం ఇలా ఉంది. వంద స్మార్ట్ సిటీలను రూపొందిస్తామని 2015 జూన్‌లో మోడీ ప్రకటించారు. నాలుగు లక్షల కోట్లరూపాయల పైనే ఉన్న ఈ కాంట్రాక్టును అమెరికా, ఫ్రాన్స్, చైనా వంటి 14దేశాలు దక్కించుకున్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన టేలెస్, అమెరికాకు చెందిన ఐబిఎం, సిస్కో సిస్టవ్‌సు సంప్రదింపులు మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు 18 మిలియన్ డాలర్ల డిజిటల్ ప్రాజెక్ట్. ఈ కంపెనీలకు భూమి, కూలీలు చవకగా లభించాయి. ఈ ప్రాజెక్టుకు రుణాలివ్వడానికి ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సిద్ధమయ్యాయి. పిడబ్ల్యుసి, మెక్ కిన్‌సే, లీ అసోసియేట్స్, బోస్చ్ వంటి న్యాయనిర్ణేతల కూటమి సంప్రదింపుల సంస్థలుగా వ్యవహరిస్తున్నట్టు పత్రికలు రాశాయి. తరువాత దీనిపైన అంతా మౌనం వహించారు. కలల నగర ప్రాజెక్టు కాస్తా ప్రస్తుతమున్న నగరాల్లోనే పరిమిత ప్రాంతాల అభివృద్ధిగా రూపాంతరం చెందింది.ప్రతి భారతీయుడి అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీనిపైన బిజెపి నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని కంకర్ ఎన్నికల ర్యాలీలో రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ హామీని తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో గెలవలేమనే భయంతో మోడీ ఈ హామీ ఇచ్చినట్టు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
‘ఇప్పుడు మనం నవ్వుకుని వెళ్ళిపోవాల్సిందే’ అని గడ్కరీ అనడం గమనార్హం. ప్రతి భారతీయుడి అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు వేస్తామని మోడీ, అమిత్ షా ఇచ్చిన హామీ కేవలం హామీ గానే మిగిలిపోయింది. ప్రజలు దీన్ని నిజమైన హామీగా నమ్మి బ్యాంకుల కెళ్ళి అకౌంట్లు తెరిచారు. మోడీ హామీలిచ్చి మరిచిపోయిన విఫలమైన పథకాలు ఎలా వెంటాడుతున్నాయో చూడండి. 1.ముంబయి అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును 2014లో ఆర్భాటంగా ప్రకటించారు. దానికి 2017 సెప్టెంబర్ 14వ తేదీన భూమి పూజ చేసి, 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రకటించారు. తాజా నివేదిక ప్రకారం వాపి సబర్మతి సెక్షన్‌ను 2027లోగా పూర్తి చేయాలని పెట్టుకున్నారు. అలా చూసినా ఇది 13 సంవత్సరాల ఆలస్యం. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు వ్యయం 108 లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు; అంటే రెట్టింపైంది. 2. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తానని మోడీ 2017లో మరొక హామీ ఇచ్చారు. ఆరేళ్ళ తరువాత దీని గురించి మాట్లాడే వాళ్ళే లేరు. 3. ‘బిజెపి అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలిస్తాను’ అని మోడీ ఎన్నికల ర్యాలీలో హామీ ఇచ్చారు. ఇదే సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ మోడీ తీవ్రవాదాన్ని తుడిచి పెట్టేశారన్నారు.
తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న తరువాత గమనిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రోజూ తీవ్రవాద వార్తలు వస్త్తూనే ఉన్నాయి. 4. మోడీ ఎర్రకోట పైనుంచి 2018లో మాట్లాడుతూ ‘2022 చివరి నాటికి ఒక భారతీయుణ్ణి అంతరిక్షంలోకి పంపుతాం’ అని ఘనంగా ప్రకటించారు. మోడీ మాటను పత్రికలు పతాక శీర్షికన పెట్టి మురిసిపోయాయి. అప్పుడే 2024 వచ్చేసింది కానీ, ఏ ఒక్క భారతీయుణ్ణి అంతరిక్షంలోకి పంపిన దాఖలాలు లేవు. 5. దేశంలో ఉన్న గ్రామాలన్నిటికీ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని మోడీ 2018 ఏప్రిల్‌లో ప్రకటించారు. కానీ 31 మిలియన్ల గృహాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. మోడీ ప్రకటనకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయలేదని ‘ఇండియా టుడే’ రాసింది. గ్రామీణుల ఉపాధి పథకాన్ని ఆధార్‌తో ముడిపెట్టడం వల్ల వారు చాలా నష్టపోయారు. రిజిస్టర్ చేసుకున్న పేదల్లో 34.8% మంది, పని చేస్తున్న పేదలు 12% మంది పనులు పోగొట్టుకున్నారు. సిబ్‌టెక్ ఇండియా ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి 7.6 కోట్ల మంది జాబ్ కార్డుదారుల పేర్లను తొలగించారు. మోడీ హామీ ఫలితం ఇది. ఆధార్ సమర్పించనందుకు ప్రధాని కిసాన్‌లో రెండు నుంచి నాలుగు లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు.
‘నల్‌సే జల్’ అనే ఇంటింటికీ కొళాయి నీళ్ళు అనే మోడీ ప్రచార పథకంలో 2022లో గుర్తించిన 13 వేల గ్రామాలకు గాను, కేవలం 5 వేల 298 గ్రామాల్లో మాత్రమే అమలు జరిగింది. కేవలం 62% ఇళ్ళకు మాత్రమే నీటి కొళాయి కనెక్షన్ లభించింది. ఉజ్వల యోజన అనేది మోడీ హామీ పథకాల్లో బాగా విజయవంతమైంది. ఈ పథకం ప్రకారం ఒక సిలిండర్‌కు రెండు వందల రూపాయల సబ్సిడీతో 2022 23లో ఇచ్చిన వాటి గురించి సమాచార హక్కు చట్టం కింద అడిగితే 9 కోట్ల 58 లక్షల మంది ఈ పథకం కిందకు వస్తే, కేవలం కోటి 51 లక్షల మందికి మాత్రమే ఒక సిలిండర్ లభించింది.కోటి 80 లక్షల మందికి ఒక్క సిలిండరు కూడా లభించలేదు. సిలిండర్ ధర భారీగా పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మధ్యప్రదేశ్‌లో 13 వేల మంది ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేదు. మోడీ ప్రచారానికి ఉపయోగపడే మరో భారీ పథకం ఆయుష్ భారత్. మోసపూరితంగా డబ్బు బదలాయింపు జరగడం, పేర్లు సరిపోకపోవడం, నకిలీ గుర్తింపు కార్డులు తయారు కావడం, వాస్తవానికి దూరంగా ఉండే పుట్టిన తేదీలు, కుటుంబ సభ్యుల సంఖ్య వంటి మోసపూరితమైన పద్ధతులతో ఈ పథకం సాగింది.
మరణించిన రోగులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బును బదలాయించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బైటపెట్టింది. ఇలాంటి అక్రమాలు బైటపడడంతో ఇందుకు కారణమైన అధికారులపైన చర్యతీసుకోవాలని జాతీయ ఆడిటర్ ఆదేశాలు జారీచేశారు. స్కిల్ ఇండియాను 2015లో ప్రారంభించినప్పుడు యువతలో ఆశలు రేకెత్తాయి. ఈ పథకంలో కోర్సులను తప్పుగా ఎంపిక చేసుకుని, కాలం చెల్లిన సాంకేతికతతో మోసపూరితంగా నివేదించారు. తగిన సదుపాయాలు లేని సంస్థలు యువతకు శిక్షణనిచ్చాయి. ప్రధాని గ్రామసడక్ యోజన, సౌరశక్తి కార్యక్రమం కూడా ఇలాంటివే. పేదల ఇళ్ళపైన సౌరశక్తి ప్యానెళ్ళను ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించారు. వీటన్నిటినీ మరిచిపోవడానికి ఎంత కాలం పడుతుంది?