Monday, December 23, 2024

హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేల శిబిరం!

- Advertisement -
- Advertisement -

భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అనంతరం జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. హేమంత్ కుడిభుజం, జెఎంఎంలో సీనియర్ నేత అయిన చంపై సోరెన్ శుక్రవారం రాజ్ భవన్ లో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

పది రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాలని కొత్త ముఖ్యమంత్రిని గవర్నర్ కోరారు. దీంతో తమ ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేయకుండా ఉండేందుకు వారిని హైదరాబాద్ కు తరలించాలని ముఖ్యమంత్రి చంపై సోరన్ నిర్ణయించారు. వారితోపాటు జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, ఆర్జెడీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ రానున్నారు. ఎమ్మెల్యేలకోసం షామిర్ పేటలోని లియోనీ రిసార్ట్ తోపాటు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తాజ్ కృష్ణ లో కూడా రూములు బుక్ చేసినట్లు తెలుస్తోంది. బలనిరూపణ తేదీ వరకూ వారంతా హైదరాబాద్ లోనే ఉంటారు.

వాస్తవానికి జెఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారమే హైదరాబాద్ రావలసి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వారు బుక్ చేసుకున్న ప్రత్యేక విమానం క్యాన్సిల్ అయింది. దీంతో శుక్రవారం ఉదయం వారు హైదరాబాద్ కు బయల్దేరారు.

82 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 41. బిజేపికి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జెఎంఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బిజేపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు 47మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంపై సోరెన్ గవర్నర్ కు లేఖ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News