Saturday, November 23, 2024

కిలో రూ. 29కే భారత్ రైస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిపోయిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం సిద్ధమయింది. ‘భారత్’ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో రూ.29 చొప్పున విక్రయించనుంది. వచ్చేవారంనుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15 శాతం పెరిగాయని చోప్రా చెప్పారు.నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( ఎన్‌సిసిఎఫ్)తో పాటుగా కేంద్రీయ భండార్ రిటైల్ విక్రయ కేంద్రాల్లో ఈ బియ్యాన్ని విక్రయిస్తామని తెలిపారు.

ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లపైనా భారత్ రైస్ లభిస్తుందని చోప్రా చెప్పారు.5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని చోప్రా చెప్పారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే భారత్ ఆటా కిలో రూ.27.50, భారత్ దాల్ ( శనగపప్పు)ను కిలో రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలపైనా చోప్రా స్పందించారు. ధరలు అదుపులోకి వచ్చేంతవరకు ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.అలాగే రిటైలర్లు, హోల్ సేల్ వ్యాపారులు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నూకలు, నాన్ బాస్మతి బియ్యం, పారా బాయిల్డ్ బియ్యం, బాస్మతి బియ్యం వివరాలను వారు వెల్లడించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేయకుండా ఈ చర్య నిరోధిస్తుందని చోప్రా తెలిపారు.నిల్వలపైనా పరిమితులు విధించబోతున్నారా అని విలేఖరులు ప్రశ్నించగా, అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది అని చోప్రా ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. దేశంలో బియ్యం తప్ప మిగతా నిత్యావసరాల ధరలు అదుపులో ఉన్నాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News