విశాఖపట్నం : ఇంగ్లండ్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి శుభ్‌మన్ గిల్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కానీ, 5 ఫోర్లతో 34 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన గిల్‌ను అండర్సన్ పెవిలియన్ పంపించాడు. దీంతో 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
జైస్వాల్ పోరాటం..
గిల్ ఔటైనా యశస్వి జైస్వాల్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ సహకారం అందించాడు. అతనిఅండతో యశస్వి మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. చివరికీ 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన శ్రేయస్‌ను టామ్ హార్ట్‌లీ వెనక్కి పంపా డు. ఈ క్రమంలో శ్రేయస్‌తో కలిసి యశస్వి మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన ఆరంగేట్రం ఆటగాడు రజత్ పటిదార్ కూడా యశస్వికి అండగా నిలిచాడు. అతనితో కలిసి యశస్వి తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇద్దరి మధ్య మరో కీలక భాగస్వామ్యం నమోదైంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పటిదార్ 32 పరుగులు చేసి రెహాన్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 60 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి పుల్‌స్టాప్ పడింది.
తర్వాత వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి యశస్వి స్కోరును మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐదో వికెట్ 52 పరుగులు జోడించారు. అక్షర్ 4 ఫోర్లతో 27 పరుగులు సాధించాడు. కాగా, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 257 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 179 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి అశ్విన్ 5 (బ్యాటింగ్) అండగా ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు.