Sunday, November 24, 2024

చట్ట వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు ఏడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరస దెబ్బలు తగులుతున్నాయి.2018లో జరిగిన ఇమ్రాన్ బుష్రా ఖాన్‌ల వివాహం చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని పేర్కొన్న కోర్టు శనివారం ఆ ఇద్దరికీ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ వారంలో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వచ్చిన మూడో తీర్పు ఇది. అంతేకాదు వచ్చే గురువారం పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయనకు తగిలిన తాజా ఎదురుదెబ్బ ఇది. ఇప్పటికే ఇమ్రాన్ పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు ప్రభుత్వ రహస్యాలు లీక్ చేసినందుకు పదేళ్లు, ప్రభుత్వ గిఫ్ట్‌లను విక్రయించినందుకు బుష్రాఖాన్‌తో పాటుగా 14 ఏళ్ల జైలు శిక్షలు విధిస్తూ కోర్టులు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే, కాగా తాజా కేసులో ఇరువురికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల(పాక్ కరెన్సీ)చొప్పున జరిమానా కూడా విధించినట్లు ఎఆర్‌వై న్యూస్ తెలిపింది.

బుష్రా తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇచ్చి ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం వేచి ఉండాల్సిన సమయాన్ని పూర్తి చేయకుండానే ఆయనను వివాహం చేసుకున్నారనేది ఆమెపై ఉన్న అభియోగం. తొలి సారి పాక్ ప్రధానిగా ఎన్నిక కావడానికి ఏడు నెలల ముందు 2018 జనవరిలో రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరూ ‘నిఖా’ ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఇద్దరూ గడువు ముగియడానికి ముందే వివాహం చేసుకున్నారా అనే దానిపై వివాదం ఉంది. జనవరిలో జరిగిన పెళ్లిపైవచ్చిన వార్తలను మొదట ఖండించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్(పిటిఐ) కొద్దివారాల తర్వాత దాన్ని ధ్రువీకరించింది. అయితే తాము ఏ తప్పూ చేయలేదని ఈ ఇరువురూ వాదిస్తున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం రావల్పిండిలోని జైల్లో ఉండగా, ఆయన భార్య మాత్రం ఇస్లామాబాద్‌లోని తమ భవనంలోనే శిక్షాకాలం గడపడానికి కోర్టు అనుమతించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News