సిటిబ్యూరోః డేటా ఎంట్రీ పేరుతో ఉద్యోగాలిచ్చి ఆ తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 5 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….గుజరాత్ రాష్ట్రం, సూరత్‌కు చెందిన రాహుల్ అశోక్, సాగర్ పాటిల్, అల్పేశ్ తోరట్, నీలేష్ పాటిల్‌ను అరెస్టు చేశారు. రాహుల్ అశోక్ గతంలో సూరత్ ఇలాంటి నకిలీ కాల్ సెంటర్ పనిచేశాడు. ఈ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి దాని యజమాని నితేష్‌ను అరెస్టు చేయడంతో ఉద్యోగం మానివేశాడు. ఉద్యోగాల పేరుతో ఎలా మోసం చేయాలో అక్కడ నేర్చుకున్న నిందితుడు ఫ్లోరా సోల్యూషన్ పేరుతో కంపెనీని ప్రారంభించాడు. ఉద్యోగాల కోసం చూస్తున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకున్నాడు. మిగతా వారిని తనకు సాయం కోసం తీసుకున్నాడు.
ప్రధాన నిందితుడు అశోక్ నిరుద్యోగులకు డాటా ఎంట్రీ పేరుతో వాట్సాప్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నాడు. దానికి స్పందించిన వారికి ఐడి, పాస్‌వర్ట్‌ను పంపించి కొంత వర్క్ ఇస్తున్నాడు. పనిచేసిన వారికి కంపెనీ నిబంధనలకు అనుగుణంగా చేయలేదని బెదిరించేవాడు. కొద్ది రోజుల తర్వాత వారికి లీగల్ నోటీసు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే సైబరాబాద్‌కు చెందిన ఓ మహిళకు వాట్సాప్‌లో మెసేజ్ రావడంతో డెటా ఎంట్రీ పేరుతో ఉద్యోగం చేసింది. తర్వాత ఆమెకు నిందితులు నకిలీ లీగల్ నోటీసు పంపించడంతో భయపడి రూ.6,17,660 పంపించింది. తర్వాత తను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నోటీసులకు భయపడిన వారి నుంచి నిందితులు అందినకాడికి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా ఎంతో మందిని నిందితులు దేశవ్యాప్తంగా మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 358 కేసులు ఉండగా, తెలంగాణలో 28 నమోదు కాగా, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ముఠా బాధితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.