ఎక్కువ ఆదాయాన్ని సమాకురుస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నదని, తమ సొమ్ముతో ఉత్తరాది హిందీ రాష్ట్రా లను పోషిస్తున్నదని, ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే దక్షిణాది వేర్పాటు ను డిమాండ్ చేసే ప్రమాదం తలెత్తుతుందని కర్ణాటకకు చెందిన పార్లమెంటు స భ్యుడు, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి కె శివకుమార్ సోదరుడు డి కె సురేష్ చేసిన వ్యాఖ్యలోని అసలు అంశానికి సమాధానం చెప్పకుండా బిజెపి దానిని రాజకీయం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ఇంత ఘాటుగా కాకున్నా సురేష్ చేసిన ఈ వాదనను గతంలోనూ దక్షిణాదికి చెందిన నాయకులు లేవ నెత్తారు. తొందరగా అభివృద్ధి చెందడమే నేరమన్నట్టు కేంద్రం తమ వాటాను తమకు ఇవ్వకుండా మాడబెడుతున్నదనే విమర్శ పలుమార్లు దక్షిణాది నుంచి వినవచ్చింది. ఇప్పుడు అందుకు మరికొంచెం ముందుకువెళ్లి దక్షిణాది పట్ల కేంద్రం చూపుతు న్న ఈ చిన్నచూపు వేర్పాటు ధోరణులను రెచ్చగొట్టవచ్చునని సురేష్ హెచ్చరించారు. దక్షిణా ది ప్రజల్లోని అసంతృప్తి మితి మించి రగలకుండా చూడవలసిందని కేంద్రానికి ఆయన హిత వు పలికారు.
కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ఫై వ్యాఖ్యానిస్తూ సురేష్ ఈ విధంగా అభిప్రా యపడ్డారు. దానితో సురేష్ దేశభక్తిని శంకిస్తూ బిజెపి ఎంపిలు విరుచుకుపడ్డారు. దేశాన్ని రెండుగా చీల్చాలని చూస్తున్నారని ఇది కాంగ్రెస్ నైజమని ఎదురు దాడికి దిగారు. వస్తు, సేవల (జిఎస్‌టి) తదితర పన్నుల కింద దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధుల కు, వాటికి కేంద్రం ఇస్తున్న మొత్తానికి గల వ్యత్యాసం గురించి చర్చించి తమకు అన్యాయం జరుగుతున్నదని ఆ రాష్ట్రాలు వెలిబుచ్చుతున్న అభ్యంతరం వాస్తవమా కాదా నిగ్గు తేల్చడానికి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా బిజెపి పెద్దలు ప్రదర్శిం చిన వక్ర బుద్ధి సుస్పష్టం. దీనితో కాంగ్రెస్ పెద్దలు తాము దేశ ఐక్యతకు బద్ధులమని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించుకొ న్నారని చెప్పుకోవలసి వచ్చింది. 2014-15 నుంచి 2020-21 వరకు తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన మొత్తం రూ 3,65,797 కోట్లు కాగా, కేంద్రం నుంచి తెలంగాణకు అదే సమయంలో వచ్చినది రూ 1,68,647 కోట్లు మాత్రమేనని గతంలో ఒక సందర్భంలో వెల్లడైన సంగతి తెలిసిందే.
దక్షిణాది రాష్ట్రాలనుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి వెళుతున్న ప్రతి వంద రూపాయల్లో వాటికి తిరిగి అందుతున్నది 30 రూపాయ లేనని, అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రత్యక్ష పన్ను ద్వారా కేంద్రానికి అందుతున్న ప్రతి 100 రూపాయలకు వాటికి 400రూపాయలు లభిస్తున్నదని వాస్తవ గణాంకాలు నిగ్గు తేల్చాయి. ఇలా ఉత్తరాది రాష్ట్రాలు వాటి వాస్తవ వాటాకు అనేక రెట్లు అధికంగా అందుతున్న నిధులను దక్షిణాది రాష్ట్రాలు తమ అభివృద్ధి ఫలాల నుంచి పంపిస్తున్న నిధుల నుంచి తీసి ఇస్తున్నదే కదా.ఇదే విషయాన్ని ఇప్పుడు బెంగళూరు ఎంపి డి కె సురేష్ మళ్ళీ లేవనెత్తారు. ఇది వికటిస్తే ప్రమాదకరమని అన్నారు. ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకు? నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి అధికారానికి రాక ముందు ప్రణాళికా సంఘంలో చర్చించి నిధుల కేటాయింపును నిర్ణయించేవారు, ఇప్పుడు కేంద్రం లోని పాలక పక్షం ఇష్టాయిష్టాల మీద అది జరుగుతున్నదని, పరిపాలన ప్రభుత్వం చేజారి పోయి పాలక పక్షం చేతుల్లోకి వెళ్ళిపోయిందని నిపుణులు చేస్తున్న విమర్శ కాదనలేనిది.
ఈ వాస్తవాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందవలసిన నిధులను ఉత్తరాది కి మళ్ళిస్తున్నార ని కర్ణాటక ఎంపి చేసిన ఆరోపణను ఎంత మాత్రం తప్పుపట్టలేము. కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడం సహజం, అందువల్ల నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో ఈ రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను తగ్గిస్తే అది న్యాయం అనిపించుకొంటుందా?. ఉత్తరాదికి విశేష కేటాయింపులతో దక్షిణాదిని అదే పనిగా నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక దేశం డిమాండ్ రగలవచ్చు అని హెచ్చరించడం ద్వారా సమస్య తీవ్రతను కేంద్ర పాలకుల దృష్టికి తేవాలని మాత్రమే కర్ణాటక ఎంపి ఉద్దేశించారు. దానిని గమనించి తగు దిద్దుబాట్లు చేయవలసి ఉంది. పేదరికంలో నిరుద్యోగం, నిరక్షరాస్యతలో కూరుకుపోయి అధిక జనభారం కింద కుంగిపోయి ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు కూడా భారత దేశంలో భాగమే. వాటిని త్వరిత గతిని అభివృద్ధి చేయవలసి ఉంది. అందుకు దక్షిణాది రాష్ట్రాలు ఆర్ధికంగా తోడ్పడుతున్న సంగతి వాస్తవం.
దీనిని అంగీకరించి వాటికి ప్రోత్సాహకాలు కల్పించాలి, నియోజకవర్గాల పునఃపంపిణీ వంటి విషయాల్లో వాటికి జరగ గల అన్యాయాన్ని తొలగిం చాలి. ఒకే ఏడాది రెండు భారత రత్నలు ప్రకటించే సందర్భాలలో ఒకటి దక్షిణాదికి చెందేలా చూడడం వంటి చర్యల ద్వారా వారికి ఊరట కలిగించాలి.