Saturday, November 23, 2024

కేజ్రీవాల్ పై కోర్టుకు ఇడి

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 7న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన ఐదవ సమన్లను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేయడంతో సమన్లపై ఆయన స్పందించడం లేదంటూ శనివారం న్యాయస్థానాన్ని ఇడి ఆశ్రయించింది. ఇడి చేసిన ఫిర్యాదుపై న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వచ్చే బుధవారం(ఫిబ్రవరి 7)న విచారణ చేపట్టనున్నది. శుక్రవారం తమ కార్యాలయానికి రావాలని ఇడి జారీచేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఇడి సమన్లను చట్టవిరుద్ధంగా పేర్కొన్న కేజ్రీవాల్ తనను అరెస్టు చేయడమే లక్షంగా ఇడి పనిచేస్తోందని ఆరోపించారు.

నవంబర్ 2న ఇడి మొదటి సమన్లను జారీచేసిన నాటి నుంచి కేజ్రీవాల్ అరెస్టుపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే కేసుకు సంబంధించి గత ఏడాది ఆప్ నాయకులైన ఢిల్లీ మాజీ డిప్యుటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌లను ఇడి అరెస్టు చేసింది. కాగా.. పిఎంఎల్‌ఎకి చెందిన సెక్షన్ 63(4) కింద కేజ్రీవాల్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇడి శనివారం ఫిర్యాదు దాఖలు చేసింది. ఏ వ్యక్తికైనా సమన్లను జారీచేసే అధికారాన్ని ఇడికి కల్పించే సెక్షన 50 కింద తాము జారీచేసిన సమన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇడి కోర్టులో ఫిర్యాదు చేసింది. అంతేగాక సమన్లకు స్పందించని పభుత్వ ఉద్యోగి లేదా ప్రజా ప్రతినిధిపై చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఐపిసిలోని 174 సెక్షన్‌ను కూడా ఇడి తన పిర్యాదులో ప్రస్తావించింది. శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు ఇడి జారీచేసిన సమన్లపై ఆప్ స్పందిస్తూ ఇడి చర్యలు రాజకీయ దురుద్దేశంతో కూడినవని, ఇవి చట్ట వ్యతిరేకమైనవని పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్షమని, ఇది జరగడానికి తాము అనుమతించబోమని ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇడి ఇప్పటి వరకూ జారీచేసిన ఐదు సమన్లను కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. అయితే గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2న తమ ఎదుట హాజరుకవాలంటూ ఇడి కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News