హైదరాబాద్: గద్దర్ అవార్డులు త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషదాయకమని విషయమని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. శిల్పకళావేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించడం జరిగింది. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం అతడిని సత్కరించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. నంది అవార్డుల పేరు గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితం, ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవించడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పద్మవిభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదని, అభిమానుల అశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైంది అనిపిస్తుందని చిరంజీవి తెలిపారు.
పురస్కారాలు ప్రకటించిన వారికి సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఏ ప్రభుత్వానికి రాలేదన్నారు. గత ప్రభుత్వాలు నంది అవార్డులను చాలా కాలం నిలిపివేయడం నిరుత్సాహపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పీచ్‌కు చిన్నప్పటి నుంచి అభిమానిని అని, ఆయన రాజకీయాల్లో ఎంతో హుందాతనంగా ఉన్నారని మెచ్చుకున్నారు. రాజకీయాలు రోజు రోజు దిగజారుతున్నాయని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని హితువు పలికారు. విమర్శల దాడిని తిప్పికొట్టగలిగితేనే రాజకీయాల్లో ఉండగలమని చిరంజీవి చెప్పారు. రాజకీయాలలో మాటలు అనడం… మాటలు పడడం తనకు రాదన్నారు.