ప్రాజెక్టులపై సిఎం సవాల్‌కు మేం సిద్ధం
విషయం లేకే రేవంత్ బిఆర్‌ఎస్‌పై విషం చిమ్ముతున్నారు
ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి మేం అప్పగించలేదు
హామీలు అమలు చేయలేకే మాపై అబద్ధపు ప్రచారాలు : హరీశ్‌రావు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: విషయం లేక బిఆర్‌ఎస్‌పై సిఎం రేవంత్‌రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై సిఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను మేం స్వీ కరిస్తున్నామని,చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసెంబ్లీలో దిమ్మ తిరిగే సమాధానం ఇస్తామన్నారు. ఆదివారం ఎల్‌బినగర్ నియోజకవర్గం బి ఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల విస్తృతస్తాయి స మావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు మా ట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు సిఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. టిడిపిలో ఉన్న సమయంలో దానిగురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తుంటే ఆనాడు అసెంబ్లీని స్తంభింపచేసి నేను, నాయినినర్సింహారెడ్డి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలియజేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ తెలంగాణలోని ప్రాజెక్టులు కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులు అప్పగించిందని, దీంతో హై దరాబద్ తాగు నీళ్ళు, ఖమ్మం, నల్లగొండకు సాగునీరు రావటం కష్టంగా మారనుందని చెప్పారు. ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి మాజీ సిఎం కెసిఆర్ ఏనాడూ కూడా అప్పగించలేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టిందని, అప్పటి మంత్రులు జైపాల్‌రెడ్డి, జైరాం రమేష్ ఇద్దరు ఈ బిల్లు తీసుకొచ్చారని తెలిపారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగితే దిమ్మతిరిగే సమాధానం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేమని కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్థం కాకపోవటం వల్లే పూటకో అబద్ధం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఇప్పుడు 17 ఎంపీలు సీట్లు గెలుస్తెనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారు. పెన్షన్ల పెంపు దేవుడెరుగని, జనవరి పెన్షన్లు ఫిబ్రవరి వచ్చిన ఇంకా ఇవ్వలేకపోయ్యారని ఎద్దెవా చేశారు.
రైతుబంధు సైతం ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సేనని కరెంట్ బిల్లులు కట్ట్టొద్దని చెప్పిన సిఎం ఇప్పడు సోనియా గాంధీ కడుతుందా అన్నారు. ఎన్నికల ముందే ఇండియా కూటమి కూలిపోయిందని, రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడన్నారు. బిఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డయడమే కాకుండా అప్పడే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. సిఎం ఇప్పటికైనా అతి తెలివిని పక్కన పెట్టి బిఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం ఆపడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజాయితీ ఉంటే ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని, భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలో హరీశ్‌రావు ధైర్యం నింపారు. ఈ సమావేశంలో ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు బిఆర్‌ఎస్ ముఖ్యనేతలు హాజరయ్యారు.