Saturday, December 21, 2024

రిటర్నింగ్ అధికారి దౌర్జన్యం..బ్యాలెట్ల ధ్వంసం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ తీరుతెన్ను చూస్తే , వీడియోలు పరిశీలిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం , ఏకంగా ఖూనీ చేసినట్లే అన్పిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. పంజాబ్‌లోని చండీగఢ్ మేయర్ ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి దౌర్జన్యం , బాహాటపు అక్రమ చర్యలకు పాల్పడ్డాడని, మేయర్ ఎన్నిక ఫలితాన్ని నిలిపివేయాలని ఆమ్ ఆద్మీపార్టీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి సోమవారం రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిష్ తీరును తప్పుపట్టారు. తమ ముందుకు వచ్చిన వీడియో ఇతర ప్రాధమిక సాక్షాధారాల క్రమంలో తేలిదేమిటంటే ఆయన ఉద్దేశపూరితంగానే బ్యాలెట్ పత్రాలను పనికిరాకుండా చేస్తూ పాడువేశారని ధర్మాసనం పేర్కొంది. ఇంతకంటే ప్రజాస్వామ్య ఖూనీ, ఎన్నికల ప్రక్రియ అపహాస్యం మరోటి ఉంటుందా? అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి తాము తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని జరపరాదని ఆదేశించారు . ఈ నెల 7వ తేదీన చండీగఢ్ కార్పొరేషన్ తొలి భేటీ గురువారం జరగాల్సి ఉంది. దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.

గత నెల 30వ తేదీన కార్పొరేషన్ మేయర్ పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో బిజెపి విజయం సాధించినట్లు ప్రకటించారు. అప్పుడు జరిగిన ఎన్నికలో బిజెపికి చెందిన మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు, ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు 12 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది ఓట్లు చెల్లనివిగా మేయర్ ప్రకటించారు. అయితే రిటర్నింగ్ అధికారి కావాలనే సక్రమమైన ఓట్లను చెల్లనేరనివిగా పేర్కొంటూ వాటిని చింపివేశారని పేర్కొంటూ, తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఆప్ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నిక చెల్లనేరనిదిగా ప్రకటించాలనే ఆప్ కౌన్సిలర్ కుల్దీప్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీనితో తమకు న్యాయం చేయాలని ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిటర్నింగ్ అధికారి తప్పుడుచర్యలతోనే బిజెపి అభ్యర్థి విజయం ఖరారు అయిందని పిటిషనర్ తమ వద్ద ఉన్న సాక్షాధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన సిజెఐ బ్యాలెట్ పత్రాలను ప్రిసైడింగ్ ఆఫీసర్ ధ్వంసం చేసినట్లు అన్పిస్తోంది. ఆ వ్యక్తిని తగు విధంగా విచారించి శిక్షించాల్సి ఉంటుందని సిజెఐ ఇతర న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపింది.

సంబంధిత అధికారి డ్రామాకు దిగినట్లు అన్పిస్తోంది. దీనిపై కేంద్రం తరఫున ఉన్న సొలిసిటర్ జనరల్ ఏమంటారు? ప్రజాస్వామ్యాన్ని గేలి చేయడం, పబ్లిగ్గా ఖూనీ చేయడమే కదా? ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న అధికారి ఈ విధంగా వ్యవహరిస్తాడా? కొన్ని ఓట్లను ఆయన చూడకపోవడం, కొన్నింటిని తారుమారు చేయడం లేదా పాడుచేయడం వంటి పనులకు దిగినట్లు తెలుస్తోందని , ఇటువంటి చర్యలను తాము చూస్తూ ఊరుకునేది లేదని ధర్మాసనం తెలిపింది. ఆయనను సుప్రీంకోర్టు గమనిస్తోందని తెలియచేయండని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిజాయితీగా ఉండాల్సిందే. విజేతను ఏకంగా రిటర్నింగ్ అధికారి ఎంచుకుని ఫలితాన్ని తారుమారు చేయడం కుదరదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హత్యను సహించేది లేదని చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అప్పటి మేయర్ ఎన్నికకు సంబంధించిన రికార్డులన్నింటిని భద్రపర్చాలని పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. అప్పటి బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ సంబంధిత వీడియోలు భద్రంగా ఉంచాలి. తమ తదుపరి విచారణ వరకూ ఈ కార్పొరేషన్ సమావేశం జరగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News