కొలంబో: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆతిథ్య శ్రీలంక టీమ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం నాలుగో రోజు అఫ్గాన్ ఉంచిన 56 పరుగుల లక్ష్యాన్ని లంక ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నె 32 (నాటౌట్), నిషాన్ మధుష్కా 22 (నాటౌట్) ధాటిగా ఆడడంతో లంక 7.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అంతకుముందు అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.
ఆదివారం మూడో రోజు అసాధారణ పోరాట పటిమను కనబరిచిన అఫ్గాన్ సోమవారం మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయింది. లంక బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీస్తూ అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ప్రభాత్ జయసూర్య ఐదు, ఫెర్నాండో మూడు, రజిత మూడు వికెట్లను పడగొట్టారు. అఫ్గాన్ జట్టులో ఓపెనర్ ఇబ్రాహీం జద్రాన్ (114) అద్భుత సెంచరీని సాధించాడు. మిగతావారిలో నూర్ అలీ (47), రహెమత్ షా (54), నసీర్ జమాల్ 41 (నాటౌట్) మాత్రమే రాణించారు. కాగా, అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు మాత్రమే చేయగా, లంక 439 పరుగుల భారీ స్కోరును సాధించింది.