సిటిబ్యూరోః మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాగుట్ట మాజీ ఇన్స్‌స్పెక్టర్‌ను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు అదుపు తప్పి ప్రజాభవన్ వద్ద డివైడర్‌కు ఢీకొట్టింది. ఈ కేసులో సంఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట అప్పటి ఇన్స్‌స్పెక్టర్ దుర్గారావు షకీల్ కుమారుడు సాహిల్‌ను స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత సాహిల్‌ను తప్పించి దుబాయ్‌కి వెళ్లిపోయేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సాహిల్‌కు బదులు, అతడి డ్రైవర్‌ను నిందితుడిగా చేర్చారు. ఉన్నతాధికారులు కారు ప్రమాదంపై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న బోదన్ ఇన్స్‌స్పెక్టర్‌ను హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేయగా, దుర్గారావు పరారీలో ఉన్నాడు. దుర్గారావు కోసం వెతుకుతున్న పోలీసులు ఎట్టకేలకు ఎపిలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకుని వచ్చిన పోలీసులు వెస్ట్‌జోన్ డిసిపి కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దుర్గారావు హైకోర్టులో గతంలో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు.