Sunday, November 24, 2024

కాలిఫోర్నియాలో కుండపోత వర్షం… చెట్లు కూలి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. దీనికి తోడు బలమైన గాలులు వీచడంతోపాటు హిమపాతం కురిసింది. మొత్తం 130 చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు గవర్నర్ ప్రకటించారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లాస్ ఏంజెలెస్‌లో వీధుల్లోకి బురద నీరు కొట్టుకొచ్చింది. 100 చోట్ల మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. లాస్ ఏంజెలెస్‌లో రెండు రోజుల్లో 6.35 అంగుళాల వర్షం కురిసింది.

గత 150 ఏళ్లలో నమోదైన తొలి ఐదు అత్యధిక వర్షపాతాల్లో ఇది ఒకటి. 1934లో పడిన 7.98 అంగుళాల వర్షపాతమే ఇక్కడ రికార్డు. వేల సంఖ్యలో విమాన సర్వీసులు జాప్యం అవుతున్నాయి. లాస్ ఏంజెలెస్ ఎయిర్ పోర్టులో 1100 విమాన సర్వీసుల్లో జాప్యం చోటు చేసుకోగా మరో 60 రద్దయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో 255 విమానాలు రద్దు అయ్యాయి. మరో 840 సర్వీస్‌ల్లో జాప్యం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో 3.5 కోట్ల మంది ప్రస్తుతం వరద ముప్పులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News