ఇద్దరు బాలికలు ఆత్మహత్య…
ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు : ఎంఎల్‌సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి ఎస్‌సి గర్ల్స్ హాస్టల్‌లో ఇద్దరు బాలికల ఆత్మహత్య ఘటనపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మరో సారి స్పందించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్‌సి హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హాస్టల్‌ను కవిత మంగళవారం ఉదయం సందర్శించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగి మూడు రోజులైనా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు ప్రకటనను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తమ డిమాండ్‌కు స్పందించి ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణా నికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
కమిటీ వేసిన ప్రభుత్వం
ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి కేసులో వెంటనే విచారణాధికారిని నియమించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి అరుణను మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.ఎస్. లక్ష్మీదేవిని ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. త్వరితగతిన విచారణ జరిపి బాలికల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి…. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు.
నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024