న్యూఢిల్లీ: భారత్- మయన్మార్ సరిహద్దుల వెంబడి మొత్తం 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. పటిష్టమైన భద్రత లేని సరిహద్దుల వెంబడి ప్రస్తుతం అమలులో ఉన్న స్వేచ్ఛా సంచార వ్యవస్థ(ఎఫ్‌ఎంఆర్)కు ఈ చర్య వల్ల అడ్డుకట్ట పడనున్నది. ఎఫ్‌ఎంఆర్ కారణంగా భారత్-మయన్మార్ సరిహద్దుల్లో నివసించే ప్రజలు 16 కిలోమీటర్ల దూరం వరకు రెండు వైపులా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కలుగుతుంది. 21,643 కిలోమీటర్ల పొడవైన భారత్- మయన్మార్ సరిహద్దు మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతుంది. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2018లో ఎఫ్‌ఎంఆర్ అమలులోకి వచ్చింది.
సరిహద్దుల మీదుగా భారత్‌లోకి గిరిజన తీవ్రవాదులు చొరపడుతున్నారని ఆరోపిస్తున్న ఇంఫాల్ లోయ ప్రాంత మైతీ తెగకు చెందిన ప్రజలు సరిహద్దుల వెంబడి కంచె నిర్మించాలని చాలాకాలంగా డిమాండు చేస్తున్నారు. కంచె లేకపోవడంతోపాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు లేని అంతర్జాతీయ సరిహద్దులను ఆవకాశంగా తీసుకుని స్మగ్లర్లు భారత్‌లోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కూబా వారు ఆరోపిస్తున్నారు. భారత్- మయన్మార్ సరిహద్దు వెంబడి 1643 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మించాలని నరేంద్ర మోడీ నిర్ణయించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అమిత్ షా ప్రకటించారు. మెరుగైన నిఘా వ్యవస్థతోపాటు సరిహద్దుల వెంబడి గస్తీ మార్గాన్ని కూడా నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మణిపూర్‌లోని మోరెలో సరిహద్దుల వెంబడి 10 కిలోమీటర్ల కంచెను ఇప్పటికే నిర్మించామని అమిత్ షా తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక కిలోమీటరు, మణిపూర్‌లో అదనంగా దాదాపు 20 కిలోమీర్ల కంచె నిర్మాణానికి ఆమోదం లభించిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.