Monday, December 23, 2024

రాహుల్ ఆరోపణలు ఆవాస్తవం.. మోడీ కులంపై కేంద్రం వివరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) చెందిన కుటుంబంలో జన్మించలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఒడిశాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గురువారం ఉదయం మాట్లాడుతూ ప్రధాని మోడీ తనను తాను ఓబిసికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం ప్రధాని కులంపై రాహుల్ గాంధీ ప్రకటనకు సంబంధించిన వాస్తవాలు అన్న శీర్షికతో ఒక నోట్ విడుదల చేసింది.

సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలు, ఓబిసిల జాబితాలో మోధ్ ఘంచి కులాన్ని(ప్రధాని మోడీకి చెందిన ఉప కులంతోపాటు) గుజరాత్ ప్రభుత్వం చేర్చిందని ప్రభుత్వం వివరించింది. గుజరాత్‌లో సర్వే చేసిన తర్వాత ఇండెక్స్ 91(ఎ) కింద మండల్ కమిషన్ ఓబిసిల జాబితాను తయారుచేసిందని, అందులో మోధ్ ఘంచి కులాన్ని చేర్చిందని ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ కోసం భారత ప్రభుత్వం రూపొందించిన 105 ఓబిసి కులాల జాబితాలో మోధ్ ఘంచి కులాన్ని కూడా చేర్చిందని నోట్‌లో తెలిపింది.

ఓబిసిల జాబితాలో ఉప కులాన్ని చేర్చుతూ 1994 జులై 25న నోటిఫికేషన్ జారీ అయిందని, ఆ సమయంలో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వం తన నోట్‌లో రాహుల్ గాంధీకి గుర్తు చేసింది. 200 ఏప్రిల్ 4న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో అదే ఉప కులాన్ని ఓబిసిల జాబితాలో చేర్చారని తెలిపింది. ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడినపుడు నరేంద్ర మోడీ అధికారంలో లేరని, ఆ సమయాలలో ఆయన ప్రభుత్వ పదవుల్లో లేరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News